విశ్వవేదికపై బతుకమ్మ : మంత్రి జూపల్లి

విశ్వవేదికపై బతుకమ్మ : మంత్రి జూపల్లి
  •     విమానాశ్రయం సహా నగరవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు : మంత్రి జూపల్లి
  •     ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో భారత్‌‌‌‌‌‌‌‌–వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా ప్రచార వీడియో ప్రదర్శనపై మంత్రి హర్షం

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ, ఆడపడుచులు ఘనంగా జరుపుకొనే పూల పండుగ విశిష్టతను భావితరాలతో పాటు ప్రపంచానికి చాటిచెప్పేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టినట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు దేశ, విదేశీ పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. బుధవారం ఉప్పల్‌‌‌‌‌‌‌‌లోని రాజీవ్‌‌‌‌‌‌‌‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో జరిగిన భారత్‌‌‌‌‌‌‌‌–వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా స్టేడియంలోని భారీ తెరలపై బతుకమ్మ విశిష్టతను తెలిపే ప్రత్యేక వీడియోను ప్రదర్శించామని వెల్లడించారు. మైదానంలో ఉన్న వేలాది మంది అభిమానులతోపాటు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా క్రికెట్ ప్రేమికులకు మన సంస్కృతిని సగర్వంగా పరిచయం చేశామని మంత్రి వివరించారు.

విమానాశ్రయంలోనూ ప్రచారం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చే ఇతర రాష్ట్రాల, విదేశీ ప్రతినిధులకు తెలంగాణ వైభవం తెలిసేలా శంషాబాద్‌‌‌‌‌‌‌‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వినూత్న ప్రచార ఏర్పాట్లు చేసినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. అలాగే, నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, చారిత్రక ప్రాంతాల్లోనూ ప్రచార బోర్డులు, డిజిటల్ తెరల ద్వారా బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామని చెప్పారు. పర్యాటక శాఖ సంచాలకుడు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ రంజిత్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో అధికారులు ప్రచార కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.