- సింగరేణిని ఏటీఎంలా వాడుకున్నరు: మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్
- అక్రమాలపై ఆధారాలు చూపాలని కేటీఆర్‌కు సవాల్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సింగరేణిని ఏటీఎంలా వాడుకొని సర్వనాశనం చేశారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. గురువారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. రామగుండం సభలో కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. సింగరేణిలో టెండర్ల దోపిడీ, కమీషన్ల సంస్కృతికి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కేటీఆర్ ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ వరకు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి కార్మికుల లాభాల వాటా గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేస్తే.. ఢిల్లీకి వెళ్లి మోదీకి సహకరించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ ప్లాంటును కమీషన్ల కోసం నాసిరకంగా నిర్మించారని విమర్శించారు. ప్రస్తుతం సింగరేణిలోని 9 గనుల్లో జీ-9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతోందని శ్రీధర్‌బాబు తెలిపారు. యాదాద్రి ప్లాంటుకు ఏటా 14 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసే ఒప్పందం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. కేంద్రం నిర్వహించిన వేలంలో సింగరేణి పాల్గొనకపోవడంతో కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాకులు దక్కలేదని, దీంతో ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం కోల్పోయిందని పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
