
హైదరాబాద్ సిటీ, వెలుగు: బతుకమ్మ ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుందని, అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. బుధవారం కుంట అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. చెరువు నిర్మాణం పూర్తయినప్పటికీ, పరిసరాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కుంట చుట్టూ వాక్ వే, ప్లాంటేషన్, సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. చెరువు ఇన్‌లెట్, ఔట్‌లెట్‌లు సరిగ్గా పనిచేసేలా చూడాలని, వరద నీరు సమీపంలోని కాలనీలు, బస్తీలను ముంచెత్తకుండా నేరుగా చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు మధ్యలో బతుకమ్మను ప్రతిబింబించేలా నిర్మాణం చేయాలన్నారు.
శ్రీరాంనగర్ కాలనీ పరిశీలన..
ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు నిలిచిన బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్ కాలనీని రంగనాథ్ బుధవారం పరిశీలించారు. ముంపునకు గల కారణాలను తెలుసుకున్నారు. హుస్సేన్ సాగర్ ఔట్‌లెట్ నాలాను కలుపుతూ 30 ఏళ్ల క్రితం నిర్మించిన పైపులైను బ్లాక్ అవ్వడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. ఇక్కడి ఖాళీ ప్లాట్‌లో బోరు వేసినప్పుడు పైపులైను దెబ్బతిందని, దానికి వెంటనే మరమ్మతులు చేయాలని కమిషనర్ సూచించారు. మోటార్లు పెట్టి నీటిని తోడాలన్నారు.
ఓయూ ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో హైడ్రా చీఫ్
ఓయూ: ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా స్టూడెంట్లు కొత్త టెక్నాలజీని పెంపొందించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఓయూ వీసీ కుమార్ సూచించారు. ఓయూలో ఇంజినీరింగ్ ఫస్టియర్ స్టూడెంట్స్‌కు బుధవారం ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
ఇంజినీరింగ్ కాలేజీ మరో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటే వందేళ్లు పూర్తవుతుందన్నారు. టెక్నాలజీతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకుంటే మన దేశం పురోభివృద్ధి చెందుతుందన్నారు. చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ప్రొఫెసర్ మంగు, లెక్చలర్లు పాల్గొన్నారు.