
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఓహెచ్‌యూఏ)కు చెందిన అధికారుల బృందం గురువారం సందర్శించింది. చెరువు చుట్టూ తిరిగి అభివృద్ధి ఎలా చేశారనే వివరాలను తెలుసుకుంది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో ఉన్న ఈ ప్రాంతాన్ని హైడ్రా చెరువుగా డెవలప్ చేసిన తీరును ఫొటోలను వీక్షించి తెలుసుకుంది.
చెరువుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఒక నమూనా అవుతుందని బృందానికి నాయకత్వం వహించిన అడిషనల్ చీఫ్ టౌన్ ప్లానర్ మోనీస్ ఖాన్ పేర్కొన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించి ఈ విధంగా డెవలప్ చేసిన హైడ్రాను అభింనందించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అసోసియేట్ టౌన్ ప్లానర్ సందీప్ రావు, హైడ్రా అధికారులు మోహనరావు తదితరులు ఉన్నారు.