
- జారీ చేసిన ఎన్నికల సంఘం
- సెప్టెంబర్ 10 వరకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ జారీ చేసింది. ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికలకు ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ/జడ్పీటీసీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను
సెప్టెంబర్ 9న ప్రదర్శించాలని సూచించింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఎంపీడీఓ, ఏడీఈఏఎస్ ద్వారా పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని తెలిపింది. జిల్లా ఎన్నికల అధికారులు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఏడీఈఏఎస్ ద్వారా సెప్టెంబర్ 8న సమావేశం నిర్వహించాలని పేర్కొంది. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు స్వీకరించాలని సూచించింది.
ఏమైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే తొమ్మిదో తారీఖున పరిశీలించాలని పేర్కొంది. జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను పదో తేదీన ప్రచురించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి తప్ప అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.