అసెంబ్లీ సమావేశాల గడువుపై నేడు క్లారిటీ

అసెంబ్లీ సమావేశాల గడువుపై నేడు క్లారిటీ
  • బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ​వాకౌట్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఆదివారం క్లారిటీ ఇస్తామని మంత్రి శ్రీధర్​బాబు వెల్లడించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ బాయ్​కాట్​చేసింది. కాగా, వరదలు, నిమజ్జనం తరువాత మరోసారి సభ ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సమావేశాల గడువు, చర్చించాల్సిన అంశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.

 యూరియా సరఫరా, వరదలు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, విషజ్వరాలు, గురుకుల పిల్లల మరణాలు సహా ఇతర ప్రజా సమస్యలపై చర్చించాలని, ఇందుకు కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వరద సహాయకచర్యలు, నిమజ్జన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఆ తర్వాత మరోసారి సభ నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్​బాబు చెప్తున్నా వినిపించుకోకుండా బీఏసీ మీటింగ్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. వాకౌట్ తరువాత మీడియా పాయింట్ లో హరీశ్ రావు మాట్లాడారు. కాళేశ్వరం రిపోర్ట్ పై నాలుగు రోజులు చర్చ జరిపినా అభ్యంతరం లేదని, అదే సమయంలో ప్రజల సమస్యలపై చర్చించాలని, ఇందుకోసం కనీసం 15 రోజులు సభ నడపాలని స్పీకర్ ను, డిప్యూటీ సీఎంను కోరినట్లు చెప్పారు. కాగా, బీఏసీ మీటింగ్​కు ఎంఐఎం గైర్హాజరైంది.

అంతకుముందు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బలాలా సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై స్పీకర్ కు వినతిపత్రం అందజేశారు. వరదలు, యూరియా కొరత, రైతుల ఆత్మహత్యలు, ఫీజురియింబర్స్​మెంట్, ఓల్డ్ సిటీలో అభివృద్ధి తదితర అంశాలపై చర్చించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కాగా, అటు మండలి లోనూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్​లో బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి హాజరయ్యారు. కాగా సోమవారం మండలి సమావేశం జరగనుంది.