సీఎం నమ్మకాన్ని నిలబెడతా : మంత్రి అడ్లూరి

 సీఎం నమ్మకాన్ని నిలబెడతా : మంత్రి అడ్లూరి
  • అధికారుల సమన్వయం, సహకారంతోనే ప్రభుత్వానికి మంచి పేరు: మంత్రి అడ్లూరి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం దగ్గర ఉన్న కీలక సంక్షేమ శాఖలను ఎంతో నమ్మకంతో తనకు అప్పగించారని.. ఆ నమ్మకాన్ని నిలబెడతానని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఎన్నో ఏండ్ల తర్వాత లక్షలాది మంది స్టూడెంట్స్ కు మేలు జరిగేలా కాంగ్రెస్​సర్కారు డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచిందని మంత్రి గుర్తుచేశారు. శనివారం మాసబ్ ట్యాంక్ లోని డీసీసీ భవన్ లో ఎస్సీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి పదవీ విరమణ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి అటెండ్ అయి మాట్లాడారు.

 అధికారుల సమన్వయం, సహకారం ఉంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తూ, కొత్త నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఎస్సీ, ఎస్టీ శాఖల్లో ఏ  ఇబ్బందులు, సమస్యలు ఉన్నా అధికారులు, ఉద్యోగులు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

ఉమాదేవి 36 ఏండ్ల పాటు సుదీర్ఘంగా ఎస్సీ సంక్షేమ శాఖలో పనిచేయటం అభినందనీయమని మంత్రి అన్నారు. పదవీ విరమణ తర్వాత ఆమె అనుభవాన్ని డిపార్ట్ మెంట్ కోసం ఉపయోగించుకుంటామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్ క్షితిజ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అడిషనల్ డైరెక్టర్లు సి.శ్రీధర్, ఓఎస్డీ హనుమంతు నాయక్ తో పాటు డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.