
- నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు: సీఎం రేవంత్ రెడ్డి
- ఆయన అకాల మరణం.. ప్రజలకు తీరని లోటు
- అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం
హైదరాబాద్, వెలుగు: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల అసెంబ్లీ ప్రగాఢ సంతాపం తెలిపింది. శనివారం ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మాగంటి గోపీనాథ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగు యువత అధ్యక్షుడిగా సుమారు ఏడేండ్ల పాటు సేవలందించారు.
ఎన్టీఆర్‌కు నమ్మకమైన బంటుగా ఉండేవారు. రాజకీయాలతో పాటు సినిమా రంగంలో నిర్మాతగా కూడా రాణించారు. గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. గోపీనాథ్ ఒక క్లాస్ లీడర్‌గా కనిపించినప్పటికీ.. ప్రజలతో ఉండే అనుబంధం వల్ల ఆయనొక మాస్ లీడర్” అని అన్నారు. గోపీనాథ్ మరణం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా పేదలకు తీరని లోటని పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగతంగా గోపీనాథ్ నాకు మంచి మిత్రుడు
. 2014లో నేను రెండోసారి, ఆయన తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై.. మొదటి తెలంగాణ శాసనసభలో కలిసి పనిచేశాం. రాజకీయ పరమైన మార్పులు వచ్చినా.. మా వ్యక్తిగత స్నేహం, వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు. 2014, 2018, 2023లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన అతికొద్ది మందిలో గోపీనాథ్ ఒకరు. ఆయన అకాల మరణం చెందడం దురదృష్టకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు. గోపీనాథ్ కుటుంబానికి అందరం అండగా నిలబడదామని అన్నారు.
మాగంటి.. ప్రజల మనిషి: కేటీఆర్
మాగంటి గోపీనాథ్ మృతి.. తమ పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అనారోగ్యం ఉందని కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు. ‘‘రాష్ట్రంలో కటౌట్ల కల్చర్ తెచ్చిందే గోపీనాథ్. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో క్రీయాశీలకంగా పనిచేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సులువు కాదు. బతికినంతకాలం ప్రజల కోసం పని చేశారు.
మాగంటి మృతి పార్టీకి, ఆయన కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు. మాగంటి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది” అని చెప్పారు. కాగా, పలువురు సభ్యులు మాగంటి సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సభను ఆదివారానికి స్పీకర్ వాయిదా వేశారు.