ట్రంప్ టారిఫ్‌లు చెల్లవు : యూఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు

ట్రంప్ టారిఫ్‌లు చెల్లవు : యూఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు
  • వివిధ దేశాలపై చట్టవిరుద్ధంగా ప్రతీకార సుంకాలు విధించారు 
  • ఎమర్జెన్సీ ఎకనమిక్ యాక్ట్‌‌ కింద ట్రంప్​ సర్కారుకు ఆ అధికారం లేదు
  • రెసిప్రోకల్​ ట్యాక్స్​ విధింపులో తీవ్ర పక్షపాతం వహించారని వ్యాఖ్య

వాషింగ్టన్‌‌: టారిఫ్​ల విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌‌ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలు చట్టవిరుద్ధమని, అవి చెల్లవని యూఎస్​ ఫెడరల్‌‌ అప్పీల్స్​ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 1970 లనాటి ఇంటర్నేషనల్​ ఎమర్జెన్సీ ఎకనామిక్​ పవర్స్ ​యాక్ట్‌‌ (ఐఈఈపీఏ) కింద టారిఫ్‌‌లు విధించే అధికారం ప్రెసిడెంట్​ ట్రంప్‌‌కు లేదని తేల్చి చెప్పింది. ఈ  యాక్ట్‌‌ కింద సుంకాలను విధించే హక్కు ఉందన్న ట్రంప్  వాదనను ‘యూఎస్  కోర్ట్  ఆఫ్  అప్పీల్స్  ఫర్  ది ఫెడరల్ సర్క్యూట్’ జడ్జిలు 7–4 మెజారిటీతో తిరస్కరించారు. 

రెసిప్రోకల్​ టారిఫ్‌‌ల విధింపులో ట్రంప్​ సర్కారు తీవ్ర పక్షపాతం వహించిందని కోర్టు  ఆక్షేపించింది.  అధ్యక్షుడు ట్రంప్‌‌ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌‌లను పెంచినట్లు పేర్కొన్నది.   సుంకాలు విధించే అధికారం ‘అమెరికన్ కాంగ్రెస్’ కు తప్ప అధ్యక్షుడికి లేదని పేర్కొంది. సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు వ్యాఖ్యానించింది.  అయితే, ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునేందుకు ట్రంప్ సర్కారుకు అవకాశం కల్పించింది. 

ఇందుకు వీలుగా అక్టోబర్14 వరకు ఈ తీర్పు అమల్లోకి రాదని కోర్టు పేర్కొన్నది. ట్రంప్‌‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐఈఈపీఏను అమల్లోకి తెచ్చారు. ఏప్రిల్‌‌ 2ను ‘లిబరేషన్‌‌ డే’గా పేర్కొంటూ తమ వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు పెంచారు. బేస్‌‌లైన్‌‌గా 10 శాతం టారిఫ్‌‌లు విధించారు.  భారత్‌‌పై  50 శాతం సుంకాలు వేశారు. ఈ నెల 27 నుంచి పెంచిన సుంకాలు అమల్లోకి వచ్చాయి.

టారిఫ్‌‌ లు కొనసాగుతయ్:  ట్రంప్​

టారిఫ్​లు చెల్లవంటూ యూఎస్​ ఫెడరల్‌‌ అప్పీల్స్​ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్​ తప్పుబట్టారు. ఐఈఈపీఏ కింద సుంకాలు విధించడాన్ని  సమర్థించుకున్నారు. ఈ తీర్పు కొనసాగితే అమెరికా అక్షరాలా ఆర్థికంగా నాశనమవుతుందని తెలిపారు. ఈ మేరకు సోషల్​ మీడియా వేదిక ట్రూత్‌‌లో ట్రంప్​ పోస్ట్​ పెట్టారు. వాణిజ్య భాగస్వాములపై విధించిన టారిఫ్​లను తొలగించాలని అప్పీళ్ల కోర్టు పక్షపాతంతో తీర్పు చెప్పిందని వ్యాఖ్యానించారు. 

కానీ, చివరకు యూఎస్​ విజయం సాధిస్తుందని వారికి తెలుసునని అన్నారు.  వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కొనేందుకు టారిఫ్‌‌లే  అత్యుత్తమ మార్గమని వెల్లడించారు. సుంకాలను గనుక తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుందని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని అన్నారు.