ఇద్దరు విద్యార్థులు మృతి.. మెదక్ జిల్లాలో డెంగ్యూతో ఒకరు.. జ్వరంతో మరొకరు..

ఇద్దరు విద్యార్థులు మృతి.. మెదక్ జిల్లాలో డెంగ్యూతో ఒకరు.. జ్వరంతో మరొకరు..

కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లాలో డెంగ్యూ, తీవ్ర జ్వరంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందాడు. కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన కమ్మరి సుశాంత్ చారి(9), స్థానిక ప్రైమరీ స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్నాడు. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నాడు. తగ్గకపోవడంతో మెరుగైన చికిత్సకు కూకట్ పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించగా.. శనివారం చనిపోయాడు. విద్యార్థి డెంగ్యూతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా.. 20 రోజుల కింద మృతుడి చెల్లి సౌజన్య(7) కూడా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో  చేర్పించగా డాక్టర్లు డెంగ్యూగా తేల్చి ట్రీట్ మెంట్ చేయడంతో తగ్గిపోయింది.

ఇదిలా ఉండగా.. అదే గ్రామానికి చెందిన కొన్యాల సుమన్(15) తునికి జడ్పీ స్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు. తీవ్ర జ్వరంతో వారం నుంచి నర్సాపూర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జ్వరం ఎక్కువై ఫిట్స్ వచ్చి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై పీహెచ్ సీ డాక్టర్ శ్రీకాంత్ ను వివరణ కోరగా.. సుశాంత్ డెంగ్యూతో మృతి చెందినట్లు చెప్పలేమని, బ్లడ్ టెస్ట్ రిపోర్టులో ఎన్ఎస్-–1 వచ్చినా పాజిటివ్ చూపించిందని చెప్పారు. గ్రామంలో ఏఎన్ఎం సర్వే చేసినప్పుడు మృతుడి సుశాంత్ కుటుంబం సంగారెడ్డిలో ఉంటుండగా.. మృతిచెందిన తర్వాత సొంతూరు వచ్చారని తెలిపారు. చనిపోయిన ఇద్దరూ ఫీవర్ ఎక్కువగా వచ్చిందని గ్రామంలో చేసిన సర్వేలో తేలించదన్నారు. 

ఆసిఫాబాద్​ జిల్లాలో మరొకరు..
తిర్యాణి : జ్వరంతో బాలుడు మృతి చెందాడు. ఆసిఫాబాద్​జిల్లా తిర్యాణి మండలం గిన్నెదరి గ్రామానికి చెందిన ఆడ సీతారాం(15), పది రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించినా ఫలితంలేదు. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సీతారాం మృతి చెందినట్లు తండ్రి రాము తెలిపారు.