బతుకమ్మ ప్రసాదాలు చాలా ఈజీగా.. ఇలా తయారు చేసుకోండి

బతుకమ్మ ప్రసాదాలు చాలా ఈజీగా.. ఇలా తయారు చేసుకోండి

బతుకమ్మ.. తెలంగాణ ఆడబిడ్డలకు మస్త్ ఇష్టమైన సంబురం. గౌరమ్మను తీరొక్క పూలతో మంచిగ ముస్తాబు చేస్తరు. తొమ్మిది దినాలు మస్త్ జోష్ తో ఆడిపాడతరు. తెలంగాణ సంప్రదాయ వంటలైన మలిదముద్ద, సత్తుపిండి చేసి నైవేద్యంగా పెట్టి 'సల్లంగ చూడు తల్లీ' అని మొక్కుకుంటరు.

1. నువ్వుల సత్తుపిండి..

కావాల్సినవి: 
* నువ్వులు - ఒక కప్పు
* యాలకులు - మూడు, 
* బెల్లం - 1/3 కప్పు 

తయారీ:

కడాయి వేడిచేసి నువ్వులు వేసి వేగించి చల్లార బెట్టాలి. తర్వాత నువ్వులు, యాలకులు వేసి మెత్తటి పొడి చేయాలి. మిక్సీజార్లో కొంచెం నువ్వుల పౌడర్ ఉంచి, దాంట్లోనే బెల్లం వేసి మరోసారి గ్రైండ్ చేసి నువ్వుల పొడిలో కలపాలి.

Also Read :- అక్టోబర్ 14 నుంచే బతుకమ్మ సందడి

2. పల్లీల సత్తుపిండి

కావాల్సినవి: 
* ఒక కప్పు, 
* యాలకులు - మూడు
* బెల్లం - పావు కప్పు

తయారీ:

కడాయి వేడిచేసి పల్లీలు ఐదునిమిషాలు వేగించి, చల్లార బెట్టాలి. తర్వాత పల్లీలు, యాలకులు వేసి మెత్తగా పొడిపట్టాలి. మిక్సీజార్లో కొంచెం పల్లీ పౌడర్ ఉంచి దాంట్లోనే బెల్లం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. దాన్ని పల్లీల పొడిలో వేసి కలిపితే పల్లీల సత్తుపిండి రెడీ.

3. నాన బియ్యం ప్రసాదం

కావాల్సినవి: 

* బియ్యం - ఒక కప్పు 
* పాలు - మూడు కప్పులు
* నీళ్లు - ఒక కప్పు 
* బెల్లం - ఒక కప్పు 
* నెయ్యి - కొద్దిగా
* డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా

తయారీ:

బియ్యం కడిగి కొంచెంసేపు నానబెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో బియ్యం, పాలు, నీళ్లు పోసి ఉడికించాలి. ఇంకో గిన్నెలో బెల్లం వేసి, కొన్ని నీళ్లు పోసి కరిగించి చల్లార్చాలి. ఆ తర్వాత ఉడికిన బియ్యంలో ఈ బెల్లం పాకాన్ని పోసి కలపాలి. కడాయిలో నెయ్యి కరిగించి డ్రై ఫ్రూట్స్ వేగించాలి. వీటితో గార్నిష్ చేస్తే నానబియ్యం ప్రసాదం రెడీ. 

4. వేపకాయల ప్రసాదం

కావాల్సినవి: 
* నీళ్లు - తగినన్ని
* బియ్యప్పిండి - రెండు టేబుల్ స్పూన్లు
* నువ్వులు - కొద్దిగా ఉప్పు - తగినంత
* నూనె - వేగించేందుకు సరిపడా

తయారీ:

ఒక గిన్నెలో బియ్యప్పిండి, నువ్వులు, ఉప్పువేసి వేడినీళ్లతో చపాతి పిండిలా కలపాలి. ఆ తర్వాత కొంచెం పిండి తీసుకుని వేపకాయల్లా పొడవుగా చేయాలి. కడాయిలో నూనె వేడిచేయాలి. తయారు చేసిన వేపకాయలను నూనెలో వేసి ఎర్రగా అయ్యేవరకు వేగించాలి.

5. బియ్యం సత్తుపిండి

కావాల్సినవి:
* బియ్యం - ఒక కప్పు, 
* చక్కెర - అరకప్పు
* నెయ్యి - రెండు టీ స్పూన్లు, 
* యాలకులు - మూడు

తయారీ:

ఒక గిన్నెలో బియ్యం వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత చక్కెర, యాలకులు కలిపి మెత్తగా పొడి చేయాలి. వేగించిన బియ్యం చల్లారాక మెత్తగా పొడిచేయాలి. ఇంకో గిన్నెలో నెయ్యి కరిగించి సన్నటి మంటమీద బియ్యప్పిండిని వేగించాలి. తర్వాత చక్కెరపొడి వేసి కలిపితే బియ్యం సత్తుపిండి రెడీ.

6. అటుకుల ప్రసాదం

కావాల్సినవి: 
* అటుకులు - ఒక కప్పు, 
* బెల్లం - ముప్పావుకప్పు, 
* డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా
* నెయ్యి - కొద్దిగా

తయారీ:

కడాయిలో నెయ్యి కరిగించి డ్రైఫ్రూట్స్ వేగించాలి. అదే కడాయిలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగించాలి. అటుకులను నీళ్లలో తడిపి బెల్లం పాకంలో వేసి కలపాలి. చివర్లో డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఈ అటుకుల ప్రసాదంతో పాటు చప్పటి పప్పు కూడా నైవేద్యంగా పెడతారు.

7. వెన్నముద్దలు

కావాల్సినవి:
* బియ్యం పిండి - నాలుగు టేబుల్ స్పూన్లు, 
 * వెన్న-రెండు టేబుల్ స్పూన్లు, 
* నీళ్లు - కొద్దిగా,
* నూనె - వేగించేందుకు సరిపడా, 
* యాలకులు - నాలుగు, 
* చక్కెర – అర గ్లాస్

తయారీ:

గిన్నెలో బియ్యప్పిండి, వెన్న వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ బియ్యప్పిండిని చపాతీ పిండి ముద్దలా కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఉండలు చేయాలి. నూనె వేడిచేసి ఆ ఉండలను ఎర్రగా వేగించాలి. ఇంకో గిన్నెలో చక్కెర వేసి, అరగ్లాసు నీళ్లుపోసి పాకం పట్టాలి. చివర్లో యాలకులు వేసి స్టవ్ ఆపేయాలి. పాకంలో వెన్నముద్దలను వేయాలి.

8. మలిద ముద్దలు

కావాల్సినవి:
* గోధుమపిండి - ఒక కప్పు, 
* డ్రై ఫ్రూట్స్ - 100 గ్రాములు, 
* బెల్లం - 200 గ్రాములు, 
* నెయ్యి - కొద్దిగా, 
* కొబ్బరి - కొద్దిగా, 
* యాలకులు - మూడు, 
* సోంపు - టేబుల్ స్పూన్

తయారీ :

గోధుమపిండిని ముద్దలా కలపాలి. నెయ్యి రాస్తూ పిండిని చపాతీల్లా ఒత్తి, రెండు వైపులా కాల్చాలి. వాటిని హాట్ బాక్స్ లో పెట్టాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, యాలకులు, సోంపు కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. చపాతీలను కూడా ముక్కలుగా చేసి గ్రైండ్ చేయాలి. దీన్ని డ్రైఫ్రూట్స్ పౌడర్ లో కలపాలి. చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చుట్టాలి. 

నోట్ : మలిద ముద్దలు చేసేటప్పుడు చపాతీలు చల్లగా అయిపోతే ఉండ కట్టుకోవడానికి రాదు.

9. జొన్న పిండి

కావాల్సినవి:
* జొన్నలు - అరకప్పు, 
* బెల్లం - 1/3 కప్పు 

తయారీ:

కడాయి వేడిచేసి మంట పెంచి జొన్నలు వేగించాలి. తరువాత మూతపెట్టి, మధ్యలో కలుపుతూ వేగిస్తే జొన్నలు పేలాలు అవుతాయి. వాటిని పొడిపట్టాలి. కొంచెం పౌడర్ మిక్సీ జార్ లోనే ఉంచి, బెల్లం వేసి మరోసారి పౌడర్ చేస్తే జొన్న సత్తుపిండి రెడీ.