కోల్‌కతా: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో అనూహ్యంగా ఓడిన టీమిండియా గువాహతిలో శనివారం (నవంబర్ 22) మొదలయ్యే రెండో టెస్టు కోసం సన్నాహకాలు మొదలు పెట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం (నవంబర్ 18) జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో యంగ్ బ్యాటర్లు సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కొంత రిస్క్‌తో కూడిన ఓ వినూత్న పద్ధతిని అనుసరించారు.
టర్నింగ్ బాల్స్‌ను పక్కాగా ఎదుర్కోవడానికి ఈ ఇద్దరూ ఒక కాలుకు మాత్రమే ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. తొలి టెస్టులో ఆడని లెఫ్టాండ్ బ్యాటర్ సుదర్శన్ తన కుడి ప్యాడ్‌ను తీసివేసి ప్రాక్టీస్ చేశాడు. ప్యాడ్ అడ్డు లేకుండా ఫ్రంట్‌ఫుట్‌ను వేగంగా, పెద్ద అడుగుగా ముందుకు వేయడం దీని వెనకున్న ముఖ్య ఉద్దేశం. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేటప్పుడు బ్యాటర్లు ప్యాడ్‌పై ఆధారపడకుండా, తమ బ్యాట్‌ను ప్రధాన రక్షణగా ఉపయోగించేలా ప్రోత్సహించే పాత తరం కోచింగ్ పద్ధతి ఇది.
ఈ పద్ధతిలో ఫ్రంట్ ప్యాడ్ లేకపోవడం వల్ల బ్యాటర్లు బాల్‌ను బ్లాక్ చేయడానికి ముందుగా కాలును (ప్యాడ్) కాకుండా బ్యాట్‌ను ఉపయోగించాల్సిన ఒత్తిడి ఏర్పడుతుంది. సుదర్శన్‌తో పాటు, వికెట్ కీపర్- బ్యాటర్ ధ్రువ్ జురెల్ కూడా తన కుడి ప్యాడ్‌ను తీసివేసి సెంట్రల్ పిచ్‌పై రివర్స్ స్వీప్ షాట్స్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సెషన్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్.. సుదర్శన్‌ను నిశితంగా పర్యవేక్షించారు. మెడ నొప్పి కారణంగా శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశం ఉండగా తన స్థానంలో సుదర్శన్ తుది జట్టులోకి వచ్చే చాన్సుంది. అయితే, పేసర్లను ఎదుర్కొనే విషయంలో సాయి ఇంకా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించలేదని, ఆకాశ్ దీప్‌తో పాటు నెట్ బౌలర్లు కూడా అతడిని ఇబ్బంది పెట్టారని సమాచారం.
జట్టులోకి నితీష్ రెడ్డి.. బెంగళూరుకు గిల్!
గిల్ గాయం నేపథ్యంలో ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డిని సౌతాఫ్రికా–ఎ జట్టుతో జరుగుతున్న ఇండియా –ఎ సిరీస్ నుంచి తప్పించి కోల్‌కతాకు పిలిపించారు. తను సోమవారం సాయంత్రం కోల్‌కతాలో జట్టుతో కలిశాడు. బుధవారం రాత్రి రాజ్‌కోట్‌లో సఫారీ–ఎతో మూడో మ్యాచ్ ఆడి ఆ వెంటనే గువాహతికి వెళ్లడం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ ముందుగానే తనను రప్పించినట్టు తెలుస్తోంది. కాగా, గిల్ మెడ నొప్పి తీవ్రత అలానే ఉండటంతో తను జట్టుతో కలిసి గువాహతి వెళ్లినా మ్యాచ్ ఆడే చాన్స్ కనిపించడం లేదు. అదే జరిగితే కెప్టెన్ నేరుగా బెంగళూరులోని బీసీసీఐ సీఓఈకి వెళ్లే అవకాశం ఉంది. కాగా,
టీమిండియా రెండో టెస్టు కోసం బుధవారం గువాహతి బయల్దేరనుంది.
కెప్టెన్ ప్లేస్‌లో లెఫ్టా.. రైటా?
రెండో టెస్టుకు గిల్ దూరం అవ్వడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో తన స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో గిల్‌కు రీప్లేస్‌మెంట్‌గా మరో బ్యాటర్‌ను జట్టులో చేర్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో గువాహతి టెస్టు తుది జట్టులో కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ రూపంలో ఇద్దరు ఎక్స్‌ట్రా బ్యాటర్లు ఉన్నారు. కానీ, వీళ్లిద్దరూ లెఫ్ట్ హ్యాండర్స్. ఈడెన్ గార్డెన్స్ టెస్టులో సౌతాఫ్రికా స్పిన్నర్ హార్మర్ లెఫ్ట్ హ్యాండర్స్‌ను బాగా ఇబ్బందిపెట్టాడు.
అదే టైమ్‌లో ఏపీ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఏకైక రైట్ హాండ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. కానీ, నాలుగో నంబర్‌లో ఆడే గిల్ లాంటి ప్యూర్ బ్యాటర్‌కు ఆల్‌రౌండర్ నితీష్ సరైన రీప్లేస్‌మెంట్ కాబోడు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ నితీష్ రెడ్డి, సాయి సుదర్శన్‌ను ఇద్దరినీ తుది జట్టులోకి తీసుకుని ఓ స్పిన్నర్‌ను పక్కనబెట్టే ఆలోచన చేయొచ్చు. ఇటీవలి కాలంలో అంతగా ప్రభావం చూపని అక్షర్ పటేల్‌ను తప్పించే చాన్సుంది. ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన అనుభవం ఉన్న నితీష్ రెడ్డి ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వస్తే లోయర్ ఆర్డర్ బలోపేతం అవుతుంది. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో నితీష్‌కు ఉన్న సామర్థ్యం జట్టుకు ఉపయోగపడనుంది.
