Bathukamma Special : ఐదోరోజు ( సెప్టెంబర్ 25) అట్ల బతుకమ్మ.. విశిష్టత... ప్రాధాన్యత ఇదే..!

Bathukamma Special : ఐదోరోజు ( సెప్టెంబర్ 25) అట్ల బతుకమ్మ.. విశిష్టత... ప్రాధాన్యత ఇదే..!

బతుకమ్మ.. ఈ పేరు చెప్పగానే తెలంగాణ సాంస్కృతిక వైభవం గుర్తుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగ.  తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలో ఐదోరోజున  ( సెప్టెంబర్​ 25) అట్లబతుకమ్మగా కొలుస్తారు.  

బతుకమ్మ ఉత్సవాల్లో ఐదో రోజున బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. బియ్యాన్ని నానబెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మ తల్లికి నివేదించి, ఆడపిల్లలకు వాయనంగా ఇస్తారు. కాబట్టి అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు ఈ రోజున ఎరుపు, లేదా ఆకుపచ్చ రంగు బార్డర్ కలిగిన తెల్లచీరలుధరిస్తారు. 

బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముతైదువులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చు కుంటారు. ఐదవ రోజు కూడా ప్రతీ రోజు వలే ఇల్లంతా శుభ్రం చేసుకుని.. తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, చామంతి పూలు, మందారం, గుమ్మడి పూలతో బతుకమ్మను అందంగా పేరుస్తారు. 

ALSO READ : బతకమ్మ ప్రకృతి పండుగ.. పూలకోసం ఊరంతా తిరగాల్సిందే..!

ఇక‌ సాయంత్రం మహిళలందరూ బతుకమ్మ చుట్టూ చేరి, చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడి, నృత్యాలు చేస్తారు. ఆ తర్వాత బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా నీటిలో నిమజ్జనం చేసి, ఆ రోజు చేసిన ప్రసాదాన్ని అందరూ కలిసి పంచుకుంటారు.

తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు గౌరమ్మకు మహిళలు వివిధ రకాలుగా పూజలు చేస్తున్నారు. ప్రతిరోజు వివిధ రకాల ప్రసాదాలు తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తూ అందరూ సుఖశాంతులతో ఉండాలని భక్తి శ్రద్దలతో కోరుకుంటారు. పాడి పంటలతో, సంతానంతో సంతోషంగా జీవించాలని వేడుకుంటున్నారు. 

పేదరాశి పెద్దమ్మ మా అన్న తిట్టేట్టి ఉయ్యాలో  పాటకు లిరిక్స్​

మా అన్న తిట్టేట్టి ఉయ్యాలో
తిట్లు నేను పడుతు ఉయ్యాలో
ఒకటో పాపుకు ఉయ్యాలో
బీర పువ్వు వాసనలు ఉయ్యాలో
బీర పువ్వు దేశంబు ఉయ్యాలో
పోదామే చంద్ర ఉయ్యాలో
నీ తోటి నేనత్తే ఉయ్యాలో
మీ అన్న కొట్టడా ఉయ్యాలో
మా అన్న గొట్టేటి ఉయ్యాలో
కొట్లు నేను పడుత ఉయ్యాలో
మా అన్న తిట్టేట్టి ఉయ్యాలో
 తిట్లు నేను పడు ఉయ్యాలో
రెండో పాపుకు ఉయ్యాలో
అల్లి పూవు వాసనలు ఉయ్యాలో
అల్లి పువ్వు దేశంబు ఉయ్యాలో
పోదామే చంద్ర ఉయ్యాలో
నీ తోటి నేనత్తే ఉయ్యాలో
మీ అన్న కొట్టడా ఉయ్యాలో
మా అన్న గొట్టేటి ఉయ్యాలో
కొట్లు నేను పడుత ఉయ్యాలో
మా అన్న తిట్టేట్టి ఉయ్యాలో
తిట్లు నేను పడుతు ఉయ్యాలో
మూడో పాపుకు ఉయ్యాలో
మొగలిపువ్వు వాసనలు ఉయ్యాలో
మొగలి పువ్వు దేశంబు ఉయ్యాలో 
పోదామే చంద్ర ఉయ్యాలో
నీ తోటి నేనత్తే ఉయ్యాలో
మీ అన్న కొట్టడా ఉయ్యాలో
అనుకుంట చంద్రమ్మ ఉయ్యాలో
ఇల్లు చూడబట్టే ఉయ్యాలో
రావే వదినమ్మ ఉయ్యాలో
పోదాము బయటకి ఉయ్యాలో
అనుకుంట భీమన్న ఉయ్యాలో
చంద్రమ్మను రమ్మనే ఉయ్యాలో
మీ ఇంటి కర్రె ఆవు ఉయ్యాలో 
తుమ్మనే తుమ్మింది ఉయ్యాలో

మా ఇంటి కర్రె ఆవు ఉయ్యాలో 
మంచిదేనే వదినే ఉయ్యాలో 
మీ ఇంటి గడపళ్ల ఉయ్యాలో
 కర్రె కుక్క ఉంది ఉయ్యాలో 
మా ఇంటి కర్రె కుక్క ఉయ్యాలో
 మంచిదేనే వదినే ఉయ్యాలో 
అనుకుంట చెప్పిండు ఉయ్యాలో
 భీమన్న చూడమ్మ ఉయ్యాలో 
భీమన్న చంద్రమ్మ ఉయ్యాలో
ఇల్లు దాటి పొయిరి ఉయ్యాలో 
ఇల్లు దాటిపోయిరి ఉయ్యాలో 
వాడ దాటి పోయే ఉయ్యాలో
 కూసుండి కోసేటి ఉయ్యాలో
 కురమళ్లు దాటె ఉయ్యాలో
 వంగొంగి కోసేటి ఉయ్యాలో 
వరి చేలు దాటె ఉయ్యాలో
 నిలుచుండి కోసేటి ఉయ్యాలో
 నిండ్లు దాటె ఉయ్యాలో 
అడవికి బయలెల్లి ఉయ్యాలో 
బంగ్లాకు తీసుకొని ఉయ్యాలో
 అడవిలో ఉన్నది ఉయ్యాలో 
ఏడంత్రాల మిద్దె ఉయ్యాలో 
భీముడు అయితేను ఉయ్యాలో
 చంద్రమ్మ నయితేను ఉయ్యాలో
 ఏడు మేడల మీద ఉయ్యాలో 
ఉంచనే ఉంచిండు ఉయ్యాలో
కుసుండి కోసేటి ఉయ్యాలో 
కురమళ్లు దాటే ఉయ్యాలో
అక్కడి సంగతి ఉయ్యాలో 
అక్కడే ఉండంగా ఉయ్యాలో
రాగన్లు దున్న బోయి ఉయ్యాలో 
రామన్న వచ్చిండు ఉయ్యాలో
 రాముడు వచ్చేవరకు ఉయ్యాలో
 పేదరాశి పెద్దమ్మ ఉయ్యాలో 
ఏడవనే బట్టింది ఉయ్యాలో 
పేదరాశి పెద్దమ్మ ఉయ్యాలో