బతకమ్మ ప్రకృతి పండుగ.. పూలకోసం ఊరంతా తిరగాల్సిందే..!

బతకమ్మ ప్రకృతి పండుగ.. పూలకోసం ఊరంతా తిరగాల్సిందే..!

జానపదుల పండుగలన్నీ ప్రకృతి ఆరాధనలే. తెలంగాణ భూమిమీద మొలిచే ప్రతీ మొక్కనీ కాపాడుకోవాలనే ఆలోచన పుట్టించే పండుగ బతుకమ్మ. ఊరి చుట్టూ ఉండే చిట్టడవుల్లో పిల్లలని వదిలి ప్రకృతిలో మమేకమైపొమ్మని చెప్పే పండుగ కూడా. మిగతా పండగలన్నీ ఇంటి చుట్టూరా ఉండే పువ్వులతో, ఆకులతో ఉంటే బతుకమ్మ పండుగ మాత్రం అన్ని రకాల మొక్కలనీ, అన్ని రకాల భూములనీ పరిచయం చేస్తుంది.

తంగేడు పూలకోసం చిట్టడవిలాంటి ప్రదేశాన్ని చూస్తారు. గునుగు పూల వేటలో చేనూ చెలకల్ని చూస్తారు. అల్లిపూలు, తామర పూల కోసం చెరువులు, కుంటలని చూస్తారు. ఇంతకన్నా తమ చుట్టూ ఉండే ప్రకృతిని తెలుసుకునే అవకాశం ఇంకెక్కడ ఉంటుంది. 

గోరంట పువ్వులూ, బంతి పువ్వులు మొక్కలని పెంచటం నేర్పిస్తే, గుమ్మడి పువ్వు, బీర పువ్వు, కట్లపువ్వులన్నీ ఇంటిదగ్గర ఉండే పెరళ్ళనీ, ఇంటింటికి ఒకనాడు ఉన్న 'దడి' కట్టే విధానాన్ని నేర్పిస్తాయి. ప్రతీ పువ్వుకీ ఒక ప్రత్యేక వాతావరణం. ఒక్కొక్క పువ్వూ, ఒక్కొక్క రంగు! కాయలు కాసేవి కొన్ని కాయలే కనిపించనివి ఇంకొన్ని ఒక్కొక్క మొక్కకీ ఒక్కో ప్రత్యేకత... బతుకమ్మ పండుగ ఒక బొటానికల్ ఎడ్యుకేషన్.

తీరొక్క పువ్వులు : తంగేడు పువ్వు బంజరు భూముల్లో ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. తంగేడు పూల వేట ఒక నోస్ట్రాల్జియా పిల్లలంతా సూర్యుడు కూడా రాకముందే దగ్గరలో ఉండే చిట్టడవుల్లోకి ప్రయాణం కట్టేటోళ్లు, వాగులూ, ఒర్రెలూ దాటేటోళ్లు. ఊరి పొలిమేరలూ, నేచురల్ అప్పియరెన్స్ (నైసర్గిక స్వరూపం) ఏ సింబస్ పుస్తకాల్లోనూ నేర్పించే పనిలేదు.
చదువు చెప్పిన పండుగ బతుకమ్మ

గునుగు పువ్వు: తెలంగాణా నేనూ, చెలకల్లో ఎక్కువగా పెరిగే గడ్డి జాతి మొక్క ఇది. పశువులకు మేతగా, నీళ్లని శుభ్రం చేయటానికి ఈ మొక్కని వాడతారు. పొలాలూ, చేన్లను చుట్టివచ్చే అవకాశం గునుగు పువ్వు కోయటానికి పోయినప్పుడే కనిపిస్తుంది. రక్తవిరేచనాలకూ, డైజేషన్ ఇబ్బందులకూ ఈ మొక్కల ఆకులని వాడతారు. వారం పదిరోజుల ముందు నుంచే గునుగు పువ్వులని తేవటం మొదలవుతుంది. వీటిని ఆరబెట్టి కట్టలు కట్టి, రంగులద్దటం ఒక ఆర్ట్.

గుమ్మడి పువ్వు :  గౌరమ్మ ని పెట్టకుండా బతుకమ్మ పూర్తికాదు. రాసగుమ్మడి పువ్వు పూర్తిగా విచ్చుకున్న తర్వాత దానిలో ఉండే గౌరమ్మని బతుకమ్మ మీద ఉంచుతారు. ఆ పువ్వులని బతుకమ్మ చుట్టూ అలంకరిస్తారు. గుమ్మడిలో విటమిన్ 'ఏ' ఎక్కువగా ఉండడంవల్ల కంటి సంబంధ రోగాలకు చాలా మంచిది. కీళ్ల నొప్పులకూ రాచగుమ్మడి మంచి మందు. బతుకమ్మలో కీలకంగా ఉండాల్సిన పువ్వు కాబట్టి గుమ్మడి పాదు తెలంగాణాలోని ప్రతీ ఇంటిలోనూ కనిపించేది.

కలువ/అల్లి పువ్వు : ఊరి చెరువులు, కుంటలూ అన్నిటిలోనూ అల్లిపూలని కోసుకు రావటం ఒక అడ్వెంచర్. అల్లి, తామర పువ్వులూ, గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని సేకరించాలంటే కుంటల్లో, చెరువుల్లో దిగాల్సిందే. ఇలా ప్రతీ పువ్వుకి ఒక ప్రత్యేకత. ప్రతీ మొక్కకీ ఓ విలువ అన్నిటినీ కలిపి ఆరాధించుకునే బతుకమ్మకి అంతటి గౌరవం. పోనుపోనూ ఒక్కో మొక్కా మాయమైపోతోంది. బతుకమ్మ పెట్టే ఇత్తడి తాంబాళాలూ... మేదరి సిబ్బిలూ పోయి ప్లాస్టిక్ పువ్వులతో బతుకమ్మ కళ తప్పిన కాలంలో.. ఒక్కసారి ఆనాటి పువ్వుల బతుకమ్మలని గుర్తుచేసుకోవటం ఇప్పటి అవసరం.