ఎంగిలి పువ్వుతో మొదలై..

ఎంగిలి పువ్వుతో మొదలై..

తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మను ఎంతో భక్తితో పాటలు, ఆటలతో పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు వివిధ పేర్లతో పిలుస్తుంటారు. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా చేసుకుంటారు. పండుగ తొమ్మిది రోజులూ సాయంత్రం పూట మహిళలంతా.. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక దగ్గర పెడతారు. బతుకమ్మల చుట్టూ గుండ్రంగా తిరుగుతూ, పాటలు పాడుతూ ఆడతారు. బతుకమ్మ పాటల్లో తెలంగాణ జీవనవిధానం, ఆచారాలు, సంస్కృతి కలగలిపి ఉంటాయి. అలాగే బతుకమ్మల మీద పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఆ తల్లి తమ పసుపు, కుంకుమలను పదికాలాల పాటు చల్లగా ఉండేలా కాపాడుతుందని మహిళలు నమ్ముతారు.

రోజుకోరకం ప్రసాదం
బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజులకు తొమ్మిది పేర్లున్నట్లే.. రోజుకోరకం ప్రసాదం గౌరమ్మకు నైవేద్యంగా పెడతారు. బతుకమ్మ ఆడిన తర్వాత వాటిని నీళ్లలో వేశాక, తెచ్చిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు. కొందరు తొమ్మిది రోజులూ కుదరకున్నా.. మొదటిరోజు చేసే ఎంగిలి పూల బతుకమ్మ, చివరిరోజున సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. ఎంగిలి పువ్వు బతుకమ్మ: మహా అమవాస్యరోజున బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యప్పిండి, నూకలు కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. 

అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారుచేసి అమ్మవారికి సమర్పిస్తారు. 

ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి సమర్పిస్తారు.

నాన బియ్యం బతుకమ్మ: నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశెలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.

అలిగిన బతుకమ్మ: ఈరోజు ఎలాంటి నైవేద్యం సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ: బియ్యప్పిండిని బాగా వేగించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్ద బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారుచేస్తారు.

సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమినాడు.. దుర్గాష్టమిని జరుపుకుంటారు. అన్నంతో ఐదు రకాల నైవేద్యాలు తయారుచేస్తారు. అవి పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. వీటితో పాటు కచ్చితంగా సద్ద లడ్డూలు లేదా మలిద ముద్దలు నైవేద్యంగా పెడతారు.