పైసా ఖర్చు లేకుండా... వానాకాలంలో ఇంట్లనే ఈజీగా కూరగాయల పంటలు..

పైసా ఖర్చు లేకుండా... వానాకాలంలో ఇంట్లనే ఈజీగా  కూరగాయల పంటలు..

కాయగూరల రేట్లు చూస్తే కూర కూడ వండుకునే వశం లేకుండె. నాలుకను కట్టేసి మరీ వారంలో ఎక్కువ సార్లు ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, కోడిగుడ్డుతో అడ్జెస్ట్  అయితున్నరు. ఎండాకాలం ఇండ్లళ్ల కాయగూరలు పెంచుడు ఎట్లా మన వల్ల కాదు. కానీ, ఇప్పుడు వానాకాలం వచ్చింది. ఇంటికాడ ఏ మూలకు కొంచెం స్థలం ఉన్న చాలు.. అదో ఇత్తు.. ఇదో విత్తు పాతిపెట్టుని. ఆపత్కాలంలో కడుపు నింపుతయ్!

ఫస్ట్ వాన పడంగనే ఊళ్లల రైతులు పొలాల్ల ' విత్తనాలు వేస్తరు. ఇగ ఇంటికాడ పెరట్లో కట్టెపుల్లతో ఇట్లా అని చిక్కుడు, ఆనిగె మొదలుకుని ప్లేస్ని, ఓపికను బట్టి రకరకాల విత్తులు పెడ్తారు. అవి ఇంటి చుట్టూ.. తీగ పారి.. వినాయకచవితికి మొదలు పెట్టి దీపావళి, సంక్రాంతి దాంకా మార్కెట్ పోయే అవసరం లేకుండ చేస్తయ్. వానకాలంలో ఇంట్లోనే ఈజీగా పెరిగే కొన్ని కాయగూరలు ఉన్నయ్. వాటిని ఈ సారి ట్రై చేయండి. ఇది టౌన్లల్లా, సిటిలల్లా ఉన్నవాళ్లకు కూడా వర్తిస్తది. గ్రౌండ్ ఫ్లోర్ లేనోళ్లు టెర్రస్ మీద, బాల్కనిలో తొట్టిలు, బ్యాగులు పెట్టి పెంచుకుని కాయగూర మొక్కలు కూడా ఉన్నయ్. వీటికి ఎస్మంటి ఎరువులు అక్కర్లేదు. పురుగులు మందు అవసరం రానే రాదు. వానదేవుడు కనికరించనప్పుడు కొన్ని నీళ్లు పోయిన్రి చాలు!

 దోసకాయ

వానాకాలంలో మంచిగ పండే కాయగూరల్లో దోసకాయ ఒకటి. దోసకాయ విత్తు వేసిన చోట మంచి మట్టి ఉండేటట్టు చూసుకోవాలె. ఎండ బాగ తగిలే ప్లేస్ లో పెట్టి.. రోజూ కొన్ని నీళ్లు పోస్తే చాలు. వీటిని తొట్టెలల్ల కూడా పెంచొచ్చు. దోసకాయ ఇత్తులు మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతయ్. దోసకాయను ఎండబెట్టి..ఈజీగా ఇంట్లోనే విత్తనాలను చేసుకోవచ్చు.

బెండకాయ

మనదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే కాయగూరల్లో మొదటిస్థానం బెండకాయదే! అయితే, బెండకాయ పొలాల్లో మాత్రమే పండే కాయగూర అనుకుంటరు చాలామంది. ఈ మాట కేవలం ఎండాకాలానికే సరిపోతది.వానకాలంలో బెండకాయ ఇంటి దగ్గరే హాయిగా పండించుకోవచ్చు. బాల్కనీలో తొట్టిలు పెట్టి అప్పుడప్పుడు నీళ్లు పోస్తే చాలు! గోడ దగ్గర పెడితే ఈ చెట్లు చూసేవాళ్లకు అందంగా కనిపిస్తాయి.

టొమాటో

మన దగ్గర ఎనభై శాతం కూరల్లో కచ్చితంగా టొమాటో ఉండాల్సిందే! వాస్తవానికి ఇది టొమాటో పండు. దీంట్లో సి-విటమిన్ పుష్కలం. మురిగిపోయిన టొమాటోలు పెరట్లో ఏదోఒక మూలకు పారేస్తేనే.. ఒక్క వాన పడంగనే నారు పెరుగుతది. ఈ వానాకాలంలో అన్నింటికన్నా... ఈజీగా పెరిగేవాటిలో టొమాటోనే నంబర్ వన్. వీటిని కూడా తొట్టిల్లో పెంచుకోవచ్చు. టొమాటో విత్తనాలు కూడా టొమాటోల్ని ఎండబెట్టి చేసుకోవచ్చు.

ముల్లంగి

ముల్లంగి అంటే తెల్వనోళ్లు చాలామంది ఉంటరు. ఇక, దాన్ని కొత్తగా చూసినవాళ్లు ఇది ఎక్కడ పండిస్తరోనని డౌట్ పడ్తారు. ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయ్. సలాడ్,సాంబార్ లో వేస్తే..లొట్టలేసుకుని తింటరు. ఇంకా ఎన్నో డిప్లో ముల్లంగి స్పెషల్గా వేస్తరు. వానాకాలంలో ముల్లంగి ప్రయోగాన్ని ఇంటిపట్టునే చేయొచ్చు. ముల్లంగి విత్తనాలు మార్కెట్లో దొరుకుతయ్. 

తీగలు

ఇంట్లో ఇంచు స్థలం ఉన్న చాలు అక్కడో విత్తనం పడేస్తే.. అవి ఇంటిమీదికి తీగ పారి గంపెడుకాయగూరల్ని ఇస్తయ్. మీకే కాదు మీరు తిన్నంక మిగిలినయ్ పక్కింటోళ్లకు ఇయ్యొచ్చు. అలాంటి వాటిలో బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, గుమ్మడికాయ, కాకరకాయ చిక్కుడ కాయ ముందు వరసలో ఉంటయ్. టైంకి వానలు పడకుంటే.. రోజుకోసారి వాటి మొదళ్ల తడిపితే చాలు! ఇవి ఏ మట్టిలోనైనా పెరుగుతయ్. ఎలాంటి ఎరువులూ, కెమికల్స్ వీటికి అవసరం లేదు. వీటిని తొట్టిలో పెట్టికూడా తీగలు ఇంటిపైకి తీగలు పారించుకోవచ్చు.

v6velugu