మహిళలకు బతుకమ్మ కానుక పంపిణీ

మహిళలకు బతుకమ్మ కానుక పంపిణీ

బతుకమ్మ పండుగ సందర్భంగా.. రాష్ట్రమంతటా పేదింటి మహిళలకు ప్రభుత్వం చీర కానుకలు అందజేసింది. జిల్లాల్లో  మంత్రులు ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేశారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  బతుకమ్మ చీరల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడపడుచులకు దసరా కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దీనివల్ల చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. చీరల పంపిణీకి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఇక చీరల పంపిణీ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలకు డ్యాన్సులు వేశారు.

వనపర్తి జిల్లా  కేంద్రంలో  బతుకమ్మ చీరల  పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు  మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.  చీరల పంపిణీతో  రాష్ట్రంలో పండగ  వాతావరణం  నెలకొందన్నారు.  ఒక్క వనపర్తి  జిల్లాలోనే  లక్షా 52 వేల చీరలను  పంపిణీ చేస్తున్నామని  తెలిపారు.  ప్రతి ఒక్కరికీ  చీరలను అందిస్తామన్నారు  మంత్రి.

ఖమ్మంలో బతుకమ్మ  చీరల పంపిణీని  ప్రారంభించారు  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.  భక్త రామదాసు  కళాక్షేత్రంలో  చీరల పంపిణీ  కార్యక్రమాన్ని  ఏర్పాటు  చేశారు. పండగను  ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని  పువ్వాడ అజయ్  చెప్పారు. ఈ సారి  10 రంగులు,  10 డిజైన్లలో  చీరలు తయారు  చేయించామన్నారు.  ప్రజలంతా  బతుకమ్మను ఉత్సాహంగా  జరుపుకోవాలన్నారు.