ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం (నవంబర్ 14) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో సఫారీ స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా ప్లేయింగ్ 11లో లేకపోవడం షాకింగ్ కు గురి చేసింది. రబడా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టులో టాప్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రబడాను తొలి టెస్ట్ నుంచి సౌతాఫ్రికా పక్కన పెట్టింది. రబడాకు తది జట్టులో స్థానం దక్కకపోవడంలో కారణం లేకపోలేదు.
టాస్ గెలిచిన తర్వాత సఫారీ కెప్టెన్ టెంబా బవుమా ఈ మ్యాచ్ లో రాబడి గాయం కారణంగా ఆడడం లేదని క్లారిటీ ఇచ్చాడు. పక్కటెముక గాయం కారణంగా రబాడా జట్టుకు దూరమయ్యాడని.. కోల్‌కతాలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా ప్లేయింగ్ 11లో కార్బిన్ బాష్ అతని స్థానంలో జట్టులోకి వచ్చాడని బవుమా తెలిపాడు. ఇండియాతో సొంతగడ్డపై ఆడుతున్న సౌతాఫ్రికాకు రబడా లేకపోవడం మైనస్ గా మారనుంది. కార్బిన్ బాష్ రబడా స్థానాన్ని ఎలా భర్తీ చేస్తాడో చూడాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన తర్వాత సౌతాఫ్రికా తమ తొలి సిరీస్ ను ఇటీవలే పాకిస్థాన్ తో ఆడి 1-1 తో సమం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆడుతుంది. పాకిస్థాన్ సిరీస్ అద్భుతంగా రాణించిన సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్ ప్లేయింగ్ 11 లో ఉన్నారు. మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్ ఫాస్ట్ బౌలర్లుగా బరిలోకి దిగారు. తొలి రోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ పై కన్నేసింది. ప్రస్తుతం మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజ్ లో మార్కరం (26), ముల్డర్ (0) ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా రికెల్ టన్ వికెట్ పడగొట్టాడు.
