
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ హెచ్చరిక
ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు సహకరించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తెలంగాణలో బీజేపీని భూస్థాపితం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హెచ్చరించారు. బీసీ జాతీయ నేత పగడాల సుధాకర్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి వద్ద రామచంద్రరావు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల ఉద్యమ ఫలం సాకారమయ్యే దశలో బీసీల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా రామచంద్రరావు మాట్లాడడం సరికాదన్నారు. రిజర్వేషన్లపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సాధ్యమైనప్పుడు, బీసీ రిజర్వేషన్లకు ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు. బీజేపీకి బీసీలు కావాలో, అగ్రవర్ణాలు కావాలో తేల్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విజయభాస్కర్, బోయ గోపి, పాల్గొన్నారు.