బీసీ రిజర్వేషన్లపై గొంతెత్తిన ఓరుగల్లు..42 శాతం రిజర్వేషన్ల అమలుకు డిమాండ్

బీసీ రిజర్వేషన్లపై గొంతెత్తిన ఓరుగల్లు..42 శాతం రిజర్వేషన్ల అమలుకు డిమాండ్
  • ఉమ్మడి జిల్లాలో బీసీ బంద్‍ ప్రశాంతం
  • పార్టీలకతీతంగా నిరసనలు, ఆందోళనలు 
  • ఎక్కడ చూసినా మానవ హారాలు, రాస్తా రోకోలు 
  • డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
  • వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‍

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్​తో ‘బంద్​ ఫర్​ జస్టిస్’​ పేరుతో శనివారం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ ఓరుగల్లు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఈ బంద్​కు ​కాంగ్రెస్‍ పార్టీతోపాటు బీఆర్‍ఎస్‍, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు, కుల, ప్రజా సంఘాలు, స్టూడెంట్‍ యూనియన్లు మద్దతు తెలిపి బంద్‍లో పాల్గొన్నాయి. స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. 

దీపావళి పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఇండ్లకు వెళ్లాలని వచ్చిన ప్రయాణికులు మధ్యాహ్నం దాటే వరకు వేచిచూడాల్సి వచ్చింది. పార్టీలకు అతీతంగా చేపట్టిన ఈ బంద్​ లో ప్రతి ఒక్కరూ పాల్గొని, రోడ్లపై మానవహారాలు, రాస్తారోకోలు, నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, వంటావార్పు చేపట్టారు.  

బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా గళమెత్తారు. కార్యక్రమాల్లో బీసీ జేఏసీ  నేతలతో కలిసి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, నాగరాజు, మేయర్‍ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, ఇతర ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు సుందర్‍రాజ్‍ యాదవ్, గడ్డం భాస్కర్‍, డాక్టర్‍ లక్ష్మీప్రసాద్‍, రాజయ్య యాదవ్‍, వడ్లకొండ వేణుగోపాల్‍, బోనగాని యాదగిరి, తిరుణహరి శేషు, కాంగ్రెస్‍ నేతలు ఈవీ శ్రీనివాస్‍, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్‍, జక్కుల రవీందర్‍, విజయశ్రీ రజాలీ తదితరులు పాల్గొన్నారు.  - వెలుగు, నెట్​వర్క్​