ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సులు తిరగలే.. షాపులు తీయలే

 ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సులు తిరగలే.. షాపులు తీయలే
  • తెరుచుకోని విద్యాసంస్థలు
  •  ఉమ్మడి పాలమూరు ​జిల్లాలో తెలంగాణ బంద్​ ప్రశాంతం

నెట్​వర్క్​, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్​తో బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణ బంద్ ఉమ్మడి మహబూబ్​నగర్ నగర్ ​జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.  అధికార కాంగ్రెస్ తోపాటు బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లీడర్లు బంద్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ డిపోల్లో నుంచి బస్సులు బయటకు రాలేదు. తెల్లవారుజాము నుంచే ఆయా పార్టీల నాయకులు డిపోల ఎదుట బైఠాయించారు.

 టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ నాయకులతో కలిసి బైక్​లపై వీధి వీధి తిరుగుతూ దుకాణాలను మూసివేయించారు. ఆల్ ట్రేడ్ యూనియన్​ఆధ్వర్యంలో ఆటోల ర్యాలీ నిర్వహించారు. పాలమూరు యూనివర్సిటీలో ధర్నా చేశారు. వర్సిటీ పరిధిలో పరీక్షలను బహిష్కరించారు. నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తా వద్ద బీసీ జేఏసీ నాయకులు ధర్నా చేపట్టారు.

 చిన్నచింతకుంట, కౌకుంట్ల, అడ్డాకుల, నర్వ, మరికల్, ఊట్కూరు, జడ్చర్ల, కోస్గి, కోయిల్​కొండ, ధన్వాడ తదితర ప్రాంతాల్లో బీసీ నాయకులు బైక్ ర్యాలీలు తీశారు. విద్యాసంస్థలకు సెలవు  ప్రకటించారు. బంద్​ సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. బస్​డిపోల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.