
- బంద్‌లో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,
- అఖిల పక్ష నాయకులు
మెదక్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘల పిలుపు మేరకు శనివారం చేపట్టిన బంద్ ఉమ్మడి మెదక్‌జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ పట్టణాలతో పాటు, ఆయా మండల కేంద్రాల్లో ఉదయం నుంచే నాయకులు షాప్‌లను బంద్ చేయించారు. మెదక్, నర్సాపూర్ ఆర్టీసీ బస్ డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నర్సాపూర్ డిపో కండక్టర్, డ్రైవర్లు వంటావార్పు నిర్వహించారు. ర్యాలీగా తిరిగి దుకాణాలు, హోటళ్లు, పెట్రోల్ బంక్‌లు మూసివేయించారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు రామాయంపేటలో బంద్‌లో పాల్గొని మద్దతు తెలిపారు. శివ్వంపేటలో అఖిల పక్ష నాయకులు నర్సాపూర్ -తూప్రాన్రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
సిద్దిపేటలో..
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్ నియోజకవర్గాలతో పాటు, జిల్లా కేంద్రంలో బంద్ లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలో బస్ డిపో ఎదుట ఉదయం ఐదు గంటల నుంచే బీసీ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు బైఠాయించి బస్సులు కదలకుండా అడ్డుకున్నారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో వర్తక వాణిజ్య, వ్యాపార సముదాయాలు, ప్రైవేట్ స్కూళ్లు స్వచ్ఛందంగా బంద్ ను పాటించాయి. స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించిన వర్తక వాణిజ్య విద్యాసంస్థల యాజమాన్యాలకు, ప్రజలకు ధన్యవాదలు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి టౌన్: జిల్లాలో అఖిల పక్ష నాయకులు, బీసీ జేఏసీ నాయకుల సమన్వయంతో బంద్ విజయవంతమైంది. ఉదయమే పట్టణంలోని కొత్త బస్టాండ్ ముందు అఖిల పక్ష నాయకులు బైఠాయించి ప్రజా రవాణా వ్యవస్థను అడ్డుకున్నారు. అనంతరం ర్యాలీగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు వెళ్లి రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలోని నటరాజ్ థియేటర్ వద్ద టీజీఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఆంజనేయులు, సంతోష్ ఆందోళనలో పాల్గొన్నారు.
పటాన్చెరు: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పటాన్చెరు మండంలంలోని ఇస్నాపూర్ చౌరస్తా లో భారీ రాస్తారోకో నిర్వహించారు. బంద్ లో భాగంగా నిర్వహించిన ఆందోళనలో కాంగ్రెస్ నేత నీలం మధు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ కొందరు అడ్డుకునే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలు గల్లీ గల్లీలో లొల్లి పెట్టి మా హక్కులను సాధించుకుంటామని తెలిపారు. కుమార్ గౌడ్, శ్రీశైలం, ఆదిత్య రెడ్డి, మహేశ్, రవీందర్, అశోక్, యాదయ్య, లింగం, పాండు, శ్రీనివాస్, వెంకటేశ్, సంజీవ్, ఖాదీర్, ఎట్టెయ్య, రాజు పాల్గొన్నారు.
రామచంద్రాపురం: రిజర్వేషన్ఎవరో పెట్టే భిక్ష కాదని, అది అర్హులకు దక్కాల్సిన హక్కు అని తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత కొల్లూరి భరత్ అన్నారు. బీసీ బంద్ సందర్భంగా స్థానిక గద్దర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.