
హైదరాబాద్ సిటీ నెట్వర్క్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సిటీలో బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు శనివారం చేపట్టిన బంద్ కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా సాగగా, మరికొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పెట్రోల్ బంకులు, వ్యాపార సముదాయాలు తెరచి ఉండడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యానగర్ నుంచి బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు నల్లకుంట మీదుగా బర్కత్ పుర డిపోకు ర్యాలీగా వెళ్లారు.
ఈ క్రమంలో తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. హిమాయత్ నగర్లో నిలోఫర్ కేఫ్ , రత్నదీప్ సూపర్ మార్కెట్ తెరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లకుంటలో బజాజ్ షోరూమ్ అద్దాలను పగలగొట్టారు. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకులను మూసివేయించారు. బర్కత్‌పురలో అవంతి కాలేజీ వద్ద బ్యానర్ చింపేవేశారు. దిల్ సుఖ్ నగర్లో ప్రైవేట్ బస్సులు, వాహనాలు అడ్డుకున్న బీసీ జేఏసీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రయాణికుల ఇబ్బందులను పోలీసులు వివరించి, బీసీ సంఘాల నాయకులను సముదాయించారు.
ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద జరిగిన నిరసనలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారామ్ యాదవ్, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, పీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాముల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బడుగు లింగయ్య యాదవ్, చింత ప్రభాకర్, జయసింహ తదితరులు తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరసన తెలిపారు.
ఓయూలో లెఫ్ట్, దళిత, బహుజన, బీసీ, స్వతంత్ర జేఏసీలు, స్కాలర్స్, విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ వద్ద మానవహారం చేపట్టారు. తార్నాక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. బోడుప్పల్లో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి ఉప్పల్ డిపో వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నేరేడ్మెట్ చౌరస్తా నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
రంగారెడ్డి, వికారాబాద్లో సంపూర్ణం
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
చేవెళ్ల, శంకరపల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. బంద్‌కు ఎమ్మెల్యే కాలె యాదయ్య మద్దతుగా కదిలారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన, సర్వే చేసి బిల్లు పంపినా కేంద్రం స్పందించట్లేదన్నారు. బీజేపీ కులతత్వ పార్టీ అని ఆరోపించారు. షాద్ నగర్ లో నిర్వహించిన బంద్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతమైంది. వికారాబాద్లో మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్ నాయకత్వంలో బంద్ జరిగింది. 42 శాతం రిజర్వేషన్ వచ్చే వరకు, ఈడబ్ల్యూఎస్ రద్దు అయ్యే వరకు ఉద్యమం ఆగదని వారు స్పష్టం చేశారు. పరిగి బస్ డిపో ఎదుట బీసీ నాయకులు నిరసన తెలిపారు. హైదరాబాద్ – -బీజాపూర్ హైవేను బ్లాక్ చేసి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని నినాదాలు చేశారు.