హైకోర్టు చెప్పినా బీసీ కమిషన్‌ నియమిస్తలే..

హైకోర్టు చెప్పినా బీసీ కమిషన్‌ నియమిస్తలే..
  • పెండింగ్‌లో అనేక అర్జీలు, ఫిర్యాదులు
  • రాజ్యాంగ హోదాతో కమిషన్‌ నియమించాలని బీసీ సంఘాల డిమాండ్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర సర్కారు బీసీ కమిషన్‌ను నియమించడం లేదు. హైకోర్టు ఆదేశించినా.. పట్టించుకోవడంలేదు. రెండేండ్లుగా చైర్మన్‌ లేకపోవడంతో ఆఫీసులో ఖాళీ కుర్చీ దర్శనమిస్తోంది. దీంతో బీసీ అంశాలపై ఫిర్యాదులు, అర్జీలు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.  

రెండేండ్లు కావస్తున్నా పట్టించుకుంటలే.. 
రాష్ట్ర ప్రభుత్వం 2016లో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తొలి చైర్మన్‌గా బీఎస్‌ రాములుతోపాటు ముగ్గురు సభ్యులతో కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ పదవీకాలం 2019 అక్టోబర్‌లో ముగిసింది. అప్పటి నుంచి కొత్తగా కమిషన్‌ను నియమించలేదు. హైకోర్టు సైతం ఏప్రిల్‌ 21న జరిగిన విచారణ సందర్భంగా కమిషన్‌ను నియమించాలని ఆదేశించింది. అయినా సర్కారు చర్య తీసుకోలేదు. కమిషన్‌ లేకపోవడంతో  వివిధ రంగాలు, సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు సక్కగ అమలు కావడం లేదు. విద్య, ఉద్యోగ నియామకాల్లోనూ అన్యాయం జరుగుతోంది. కొన్ని చోట్ల బీసీలపై దాడులు, గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి. సాధారణంగా రిజర్వేషన్లు తగ్గించాలన్నా.. పెంచాలన్నా.. బీసీ కమిషన్‌ రికమండ్‌ చేస్తుంది. కానీ 2019 పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి రికమండేషన్ లేకుండా ప్రభుత్వమే ఇష్టారాజ్యంగా బీసీ రిజర్వేషన్లను తగ్గించింది. దీనిపై హైకోర్టు మండిపడింది. రాజ్యాంగ హోదా కలిగిన బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కమిషన్‌ ఏర్పాటుకు అడ్డంకులేంది..?
బీసీ కమిషన్‌ను నియమించడానికి ఉన్న అడ్డంకులేమిటీ? అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. బీసీలపై దాడులు జరుగుతున్నయి. కొన్ని చోట్ల కుల బహిష్కరణ చేస్తున్నరు. బీసీ కమిషన్‌ ఉంటే కేసులు స్వీకరించి, విచారణ చేపట్టేది. రిక్రూట్మెంట్లలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోంది. 
–దాసు సురేష్‌, జాతీయ అధికార ప్రతినిధి, బీసీ సంక్షేమ సంఘం