V6 News

పంచాయతీల్లో బీసీ బలగం.. ఫస్ట్ ఫేజ్‌‌ సర్పంచ్‌‌ ఎన్నికల్లో దాదాపు సగం స్థానాలు కైవసం

పంచాయతీల్లో  బీసీ బలగం.. ఫస్ట్ ఫేజ్‌‌ సర్పంచ్‌‌ ఎన్నికల్లో దాదాపు సగం స్థానాలు కైవసం
  • సత్తా చాటిన బీసీలు.. 
  • రిజర్వ్‌‌డ్‌‌తో పాటు జనరల్‌‌ సీట్లలోనూ గెలుపు  
  • 25 జిల్లాల్లో 49.16 శాతం సర్పంచ్‌‌లు బీసీలే  
  • 8 జిల్లాల్లో అత్యధిక సీట్లలో విజయం
  • పెద్దపల్లి జిల్లాలో 69 శాతం, 
  • గద్వాలలో 68 శాతం స్థానాలు కైవసం


కరీంనగర్ / నెట్​వర్క్, వెలుగు: మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. బీసీ రిజర్వేషన్లు పోనూ మిగతా జనరల్ స్థానాల్లోనూ సర్పంచ్‌‌లుగా​ పోటీ చేసి విజయం సాధించారు. కొన్నిచోట్ల ఓసీలతో పోటీపడి గెలవగా, మరికొన్ని చోట్ల బీసీ అభ్యర్థులతోనే తలపడి గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాలు బీసీల ఖాతాలో పడ్డాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరిగిన 98 గ్రామ పంచాయతీల్లో 68 స్థానాల్లో (69 శాతం) బీసీలే సర్పంచ్​లుగా గెలుపొందారు. 

అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో 106 సర్పంచ్ స్థానాలకు గాను 72 స్థానాలను(68 శాతం) బీసీలు కైవసం చేసుకున్నారు. మొత్తం 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా.. జనరల్​ స్థానాలు పెద్దగా లేని మూడు ఏజెన్సీ జిల్లాలు భద్రాద్రి, ములుగు, ఆసిఫాబాద్ సహా వివరాలు అందని నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలను పక్కనపెడ్తే మిగిలిన​25 జిల్లాల్లో 1,229 మంది బీసీ సర్పంచ్‌‌లు (49.16 శాతం) గెలుపొందడం విశేషం. అంటే బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ల(18 శాతం)కు మించి సగానికి సగం సర్పంచ్​స్థానాలను గెలుచుకున్నారు. 

కరీంనగర్​ జిల్లాలో 63 శాతం బీసీ సర్పంచ్‌లే.. 

కరీంనగర్ జిల్లాలో 92 గ్రామపంచాయతీలకు గాను 58 (63%) చోట్ల బీసీలే గెలిచారు. వాస్తవానికి ఈ జిల్లాలో 25 స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వ్ అయ్యాయి. 47 చోట్ల జనరల్ కేటగిరీకి రిజర్వ్ కాగా.. 14 చోట్ల ఓసీలు గెలవగా, మిగతా 33 చోట్ల బీసీ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. అలాగే సంగారెడ్డి జిల్లాలో 136 జీపీల్లో 84 స్థానాల్లో(62%) బీసీలు విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలో 122 గ్రామ పంచాయతీల్లో 73 పంచాయతీలను బీసీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. 

మెదక్ జిల్లాలోని 160 జీపీల్లో 92, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 జీపీల్లో 46, సిద్దిపేట జిల్లాలో 163 గ్రామపంచాయతీల్లో 88 చోట్ల బీసీ అభ్యర్థులు గెలుపొందారు. మేడ్చల్ మల్కాజిగిరితో పాటు ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బీసీలకు జీపీలు రిజర్వ్ కాలేదు. అలాగే షెడ్యూల్ ఏరియా మండలాలు కలిగిన ఆసిఫాబాద్, ములుగు బీసీ సర్పంచ్‌ల సంఖ్య రెండు, మూడుకు మించలేదు. ఇవి మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ బీసీ అభ్యర్థులు సత్తా చాటారు.

14 జనరల్​ స్థానాల్లో 13 మంది బీసీలే గెలుపు..   

జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో14 గ్రామాలు జనరల్‌‌కు కేటాయించగా, ఏకంగా13 చోట్ల బీసీలు గెలుపొందారు. మిగిలిన  ఒక స్థానాన్ని ఎస్టీ క్యాండిడేట్​ దక్కించుకున్నారు. అన్ని గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ పోటీకి ముందుకు రాలేదు. కేవలం మిట్టదొడ్డి  గ్రామంలో మాత్రమే ఓసీ మహిళ పోటీ చేయగా, ఆమె ఓడిపోయారు. ఇదే జిల్లా కేటిదొడ్డి మండలంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ జనరల్​ కేటగిరీలో 10 గ్రామాలు ఉండగా.. 8 చోట్ల బీసీలు, ఒకచోట ఎస్సీ, మరో చోట ఎస్టీ గెలుపొందారు.

ఎవరు ఎంతమంది గెలిచారంటే..  

 జిల్లా    బీసీ    ఎస్సీ    ఎస్టీ    ఓసీ    మొత్తం    బీసీల శాతం 
కరీంనగర్    57    21     0    14    92    62
పెద్దపల్లి    68    20    0    10     98    69
రాజన్న సిరిసిల్ల      46    17    14     8    85    54
జగిత్యాల     73    23     9    17    122    60
హనుమకొండ    25    16    2    26    69    36 
వరంగల్     24    15    39    13    91    26  
జనగామ     29    25    15    41    110    26
భూపాలపల్లి    21    16     2    46     85    25
ములుగు      3    2    41    1    48    6
మహబూబాబాద్    20    10    111    14    155    12
మెదక్    92     26    26    16     160    57
సంగారెడ్డి     84    14    16    22    136    62
సిద్దిపేట     88     36      8    31    163    54
యాదాద్రి     68     32    30    22     153    42
జిల్లా    బీసీ    ఎస్సీ    ఎస్టీ    ఓసీ    మొత్తం    బీసీల శాతం 
సూర్యాపేట    28     40    39    52    159    17 
మహబూబ్​ నగర్    60    21    34    24    139    43
వనపర్తి    17    12    25    33    87    19
గద్వాల      72    18     4     12    106    68
నారాయణపేట     23    10    14    20    67    34
నాగర్ కర్నూల్     41     36    24    50     151      27
కామారెడ్డి    49    26    29    63    167     29 
నిజామాబాద్     90    30    22    42    184    48 
నిర్మల్     53    21     53    9    136    39
ఆసిఫాబాద్    2    2    98    111    114    2  
ఆదిలాబాద్     15    4    145    2     166    9  
మంచిర్యాల     37     20    26    4    87     42 
ఖమ్మం     49    46    37    60    192     25