- జూన్ రెండో వారంలో బీసీ విద్యార్థి రాజకీయ యుద్ధభేరి: జాజుల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వచ్చేది బీసీల ప్రభుత్వమేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, కార్యవర్గ అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించడం లేదన్నారు. అగ్రకుల రాజకీయ పార్టీల్లో చేరి మోసపోవద్దని కోరారు. జూన్ రెండో వారంలో బీసీ విద్యార్థి రాజకీయ యుద్ధభేరి సభ, జూలై 12న బీసీల రాజకీయ ప్లీనరీ, ఆగస్టు 7న బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభ, సెప్టెంబర్ నుంచి నవంబర్ చివరి వరకు తెలంగాణ వ్యాప్తంగా బీసీల రథయాత్ర, డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షలాది మందితో బీసీల రాజకీయ శంఖారావం బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మహిళా బిల్లులో సబ్ కోటా ఇవ్వకుండా దేశంలోని 40 కోట్ల బీసీ మహిళలను బీజేపీ అవమానించిందన్నారు. గత ఎన్నికల్లో బీసీ సీఎం అని ప్రకటించి, తర్వాత పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ఫ్లోర్ లీడర్, శాసనమండలి ఫ్లోర్ లీడర్ పదవులను అగ్రకులాలకు ఇచ్చిందని మండిపడ్డారు.
