బస్సులు నడవొద్దు.. షాపులు తెరవొద్దు.. బంద్‎కు సహకరించాలని BC జేఏసీ పిలుపు

బస్సులు నడవొద్దు.. షాపులు తెరవొద్దు.. బంద్‎కు సహకరించాలని BC జేఏసీ పిలుపు

బషీర్​బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‎ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బస్సులు నడవొద్దు.. విద్యాసంస్థలు తెరవొద్దు.. వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ చేయాలని కోరింది. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బంద్‎కు సంబంధించిన వాల్ పోస్టర్‎ను జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య , వైస్ చైర్మన్ వీజీఆర్ నారగొని, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ , కో చైర్మెన్ రాజారామ్ యాదవ్ కలిసి ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బంద్ తో బీసీల సెగ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసేలా బీసీలు కదిలిరావలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యంతో పాటు, విద్యాసంస్థలు , వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ కు సహకరించాలని కోరారు. 

బంద్ కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుస్తామన్నారు. మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ , గుజ్జ సత్యం, కుందారపు గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, వేముల రామకృష్ణ , నీల వెంకటేశ్, శ్యామ్ కుర్మ , విజయ్, లింగం గౌడ్, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.