బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ..జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ

బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ..జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ

కోఠి, వెలుగు: బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జనగణనలో బీసీ కులగణన చేపడతామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. జనాభా లెక్కల్లో బీసీలను కులాలవారీగా లెక్కించాలనే డిమాండ్‌తో కోఠిలోని తెలంగాణ జనగణన శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో జాజుల పాల్గొని మాట్లాడారు.

బీసీల లెక్కలు తేలితేనే రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు. జనగణనలో బీసీ కులాలవారీగా లెక్కలు తీయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా తమ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి , కేంద్ర మంత్రులను అడ్డుకోవడంతో పాటు.. ప్రధాని పర్యటనలో తమ నిరసనలు తెలియజేస్తామని జాజుల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనగణన శాఖ డైరెక్టర్ భారతి హోలికేరిని కలిసి వినతిపత్రం అందజేశారు.