
హైదరాబాద్: పీసీసీ చీఫ్ పదవిని ఈ సారి బీసీ నాయకుడికి అప్పగించాలని కాంగ్రెస్ అధినాయకత్వం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెడ్డి (ఓసీ) సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించిన విషయం తెలిసిందే.
మంత్రులుగా కేవలం ఇద్దరు బీసీలకే అవకాశం కల్పించింది. వారిలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా పీసీసీ చీఫ్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మధుయాష్కీని పీసీసీ చీఫ్ గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగోతంది.
నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేరు కూడా ఈ పదవికి పరిశీలనలో ఉందని సమాచారం. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ఈరవత్రి అనిల్ కు, ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది.