
- పార్టీలకు అతీతంగా బీసీలంతా ఏకం కావాలి
- కామారెడ్డి డిక్లరేషన్ అమలును బీజేపీ అడ్డుకుంటున్నది
- టీజేఎస్ మీటింగ్లో బీసీ నేతలు
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వచ్చే వరకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని బీసీ లీడర్లు, వక్తలు పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ డిమాండ్ పరిష్కారం అయ్యే సమయం దగ్గర్లో ఉందన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జనసమితి( టీజేఎస్ ) ఆధ్వర్యంలో “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలి. 9వ షెడ్యూల్ లో చేర్చాలి” అనే అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ జన సమితి నుంచి ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ వి హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అటెండ్ అయి మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి పీసీసీ చీఫ్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని నేతలు ఆరోపించారు. బీసీలకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరూ ఏకమై, ఒకే నినాదంతో ముందుకు రావాలని సూచించారు. పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ముందుకు రావాల్సిన రాజకీయ పార్టీలు రెండు నాలుకల ధోరణి అవలంబించడం సిగ్గుచేటన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, బీసీ అయిన కేంద్రమంత్రి బండి సంజయ్ ‘తొండి సంజయ్’లా మాట్లాడుతున్నాడని విమర్శించారు.
బీజేపీ అంటేనే బీసీల వ్యతిరేక పార్టీ అని ఆయన ఆరోపించారు. దాస్ సురేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ లు ఇస్తామంటే బీజేపీ మద్దుతు ఇవ్వకుండా మోసం చేస్తున్నదని, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని లేకపోతే రాబోయే రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేసి తమిళ్ నాడు తరహాలో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చి బీసీ లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో టీజేఎస్ ప్రధాన కార్యదర్శి నిజ్జనమ రమేశ్, గౌడ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్, బీసీ సంఘాల నేతలు గణేశ్ చారి, లక్ష్మణ్ యాదవ్, బీసీ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు సాంబశివ గౌడ్, మద్దెల సంతోష్ ముదిరాజ్ పాల్గొన్నారు.