
- ఓబీసీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్, బీసీ చైతన్య వేదిక చైర్మన్ ప్రొ.కూరపాటి వెంకటనారాయణ
- హనుమకొండ రాంనగర్ లో రౌండ్ టేబుల్ మీటింగ్
హనుమకొండ, వెలుగు: బీసీలకు రిజర్వేషన్లతో పాటు రాజ్యాధికారం దక్కేవరకు పోరాటం ఆగదని ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్, బీసీ చైతన్య వేదిక చైర్మన్ ప్రొ.కూరపాటి వెంకటనారాయణ స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రెడ్డి జాగృతి సంస్థ అడ్డుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో వేసిన పిటిషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ రాంనగర్ లోని బీసీ భవన్ లో ఆదివారం వారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణలో బీసీలు బలహీనులు కాదని, బాహుబలులని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, తమిళనాడు తరహాలో బిల్లు తీసుకొచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు అన్ని బీసీ కుల సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణు గౌడ్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొ.గడ్డం భాస్కర్, ఓబీసీ ఉపాధ్యక్షురాలు డా.టి.విజయలక్ష్మి, మౌనిక గౌడ్, వివిధ బీసీ సంఘాల నేతలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేథావులు పాల్గొన్నారు.