పీసీసీ బరిలో బీసీ లీడర్లు

పీసీసీ బరిలో బీసీ లీడర్లు

పీపీసీ చీఫ్​ పదవి తమకు కేటాయించాలని కాంగ్రెస్​లోని సీనియర్ బీసీ నేతలు డిమాండ్​ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో  పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి సంవత్సరం తిరక్కుండానే దించేశారని హైకమాండ్ పై వారు గరమవుతున్నారు. శనివారం గాంధీ భవన్​లో జరిగిన పీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా బీసీలకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనే చర్చ సాగింది. సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ బీసీ నేతలు వి.హన్మంతరావు, డాక్టర్ వినయ్, కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి లేకపోవడంతో పార్టీ పరంగా పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా బీసీలకే ఆ పదవి ఇవ్వాలని వారు సమావేశం ద్వారా హైకమాండ్ ను కోరారు. బీసీ నేత కీలక పదవిలో లేకపోవడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీ నాయకులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ లోని బీసీ నాయకులకు న్యాయం జరుగాలంటే పీసీసీ చీఫ్​ పదవి బీసీ నేతకే ఇవ్వాలన్నారు. గతంలో పీసీసీ చీఫ్ లుగా బీసీ నేతలు వి.హన్మంతరావు, డి.శ్రీనివాస్, కే.కేశవరావు, బొత్స సత్యనారాయణ,  పొన్నాల లక్ష్మయ్య పని చేశారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి పీసీసీ చీఫ్ గా పని చేసే అవకాశం బీసీ నేతగా పొన్నాల లక్ష్మయ్యకు దక్కింది. ఆయన 2014  అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ ఎన్నికల్లో  కాంగ్రెస్ కు కేవలం 21 సీట్లే వచ్చాయనే కారణంతో పొన్నాలను ఆ పదవి నుంచి దించేశారని కాంగ్రెస్ లోని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తర్వాత పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నాలుగేండ్లు గడిచాయని, 2018లో జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో  కాంగ్రెస్ కు కేవలం 19 సీట్లు వచ్చాయని, మరి పీసీసీ చీఫ్​ను మార్చరా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లోని మరి కొందరు బీసీ నేతలు కాంగ్రెస్ సాధికారిత కమిటీ వేదికగా.. బలహీనవర్గాల నేతలకు తగిన గౌరవం ఇవ్వాలనే డిమాండ్ ను వినిపించేందుకు త్వరలోనే సమావేశం కానున్నారు.

రేసులో వీరు..!

పీసీసీ చీఫ్ రేసులో  బీసీల తరపున సీనియర్ కోటాలో  మాజీ చీఫ్​ వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య ఉండగా, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ , మధు యాష్కీ కూడా ఆశిస్తున్నట్లు కాంగ్రెస్​ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పీసీసీ రేసులో లేనప్పటికీ, అవకాశం వస్తే వదులుకోవద్దనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు సమాచారం.