- బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
బషీర్బాగ్, వెలుగు: వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్(డీఎస్ఓ) కాశీ విశ్వనాథ్ అవినీతిపై విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన అవినీతికి సహకరిస్తున్న ఉన్నతాధికారుల పైనా దర్యాప్తు చేయాలన్నారు. మంగళవారం బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
డీఎస్వో అక్రమాలపై బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులతో కలిసి సీఎస్రామకృష్ణారావుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పెబ్బేరు మండలంలోని అనుమతి లేని ఓ రైస్ మిల్లులో అక్రమంగా వడ్లు దించుతున్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తే విచారణకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్వోను పంపించడం ఏంటని ప్రశ్నించారు.
అక్రమాలు బయటపడినా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. పెబ్బేరు పీఏసీఎస్ అవినీతిమయంగా మారిందని, పక్క జిల్లాలకు చెందిన రైస్ మిల్లర్లు తప్పుడు ట్రక్ షీట్లతో పెబ్బేరు మండల గోదాముల్లో అక్రమంగా ధాన్యం నిల్వ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా అవసరమైతే సీఎం రేవంత్రెడ్డి, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. జేఏసీ నాయకులు గాలిగల్ల సాయిబాబా, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
