
- బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం హె చ్చరిక
- ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా
- హాజరైన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ముషీరాబాద్, వెలుగు: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి ఎన్నికలు నిర్వహించాలని బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం డిమాండ్ చేసింది. బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరింది. ఈ మేరకు మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన బీసీలు మహా ధర్నా చేపట్టారు.
మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ పెద్దిరాజు, మాజీ స్పీకర్మధుసూదనాచారి, స్వామి గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీసీ కుల సంఘాల కన్వీనర్ బాల్ రాజ్ గౌడ్ హాజరై మాట్లాడారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో బీసీ డిక్లరేషన్ పై ప్రకటన చేయించారని, కాంగ్రెస్ మోసపూరిత మాటలు మానుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లు అమలు కాకపోతే వేల మందితో కర్నాటకకు వెళ్లి సిద్ధరామయ్య ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకు వస్తున్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం, చట్టాన్ని తయారు చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపి ఇప్పుడు ఆర్డినెన్స్ ఇస్తే చెల్లుబాటు ఎట్లా అవుతుందన్నారు. జీవోతో రిజర్వేషన్లు అమలవుతాయంటే ఇన్నాళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలని, లేకుంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు క్షమించబోరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని డిమాండ్చేశారు. బిల్లుకు చట్టబద్ధత కల్పించకుంటే భూకంపం సృష్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు.