
- న్యాయనిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్ట్‌పైనే ప్రధాన చర్చ
- మంత్రులందరి అభిప్రాయాలకు తగ్గట్టు ముందుకు..!
హైదరాబాద్, వెలుగు:బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా గురువారం (అక్టోబర్ 23) రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికపై ఇందులో చర్చించి.. లోకల్‌బాడీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ప్రత్యేకించి సుప్రీంకోర్టు గత తీర్పులు, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల స్టే నేపథ్యంలో కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వనుంది? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతున్నది? అనేది ఆసక్తికరంగా మారింది.
సెప్టెంబర్ 30తోనే ముగిసిన హైకోర్టు గడువు
వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా ముగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో అక్టోబర్ 9న రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ, అదే రోజు బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం గడువు కోరాయి.
ఈ నేపథ్యంలోనే చర్చించుకుని ఎన్నికల ప్లాన్ చెప్పాలని సూచిస్తూ హైకోర్టు నవంబర్ 3కు విచారణ వాయిదా వేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ ఎప్పుడు అనేది ప్రభుత్వం కచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే 20 నెలలుగా రూరల్ లోకల్బాడీల్లో పాలక వర్గాలు లేక ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలపై కేబినెట్లో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. తాజాగా ఓ పిటిషన్ విచారణ సందర్భంగా.. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించుకుని తనకు తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
దీనిపై విచారణ నవంబర్ 3న జరగనుంది. ఇప్పటికే బీసీల రిజర్వేషన్ల అమలు కోసం చేపట్టిన కులగణన సర్వే, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక, హైకోర్టు ఇచ్చిన స్టే, సుప్రీంకోర్టు డిస్మిస్ ఆర్డర్ వాదనల సందర్బంగా న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు, చేసిన వ్యాఖ్యలు వంటివన్నింటిని మంత్రివర్గ సమావేశంలో చర్చించి, మంత్రులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే సీఎం రేవంత్‌రెడ్డి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తున్నది.
ఎంత టైమ్ పడుతుందో చెప్పలేమన్న కమిటీ?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం న్యాయస్థానాల్లో తేలేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని న్యాయ నిపుణుల కమిటీ నివేదించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ సర్కారు తెచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతివాదులకు కలిపి ఆరు వారాల గడువు ఇచ్చింది. జీవో 9 మధ్యంతర స్టేపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టంచేసి, పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఈ సందర్భంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ వ్యాఖ్యానించింది. ఇటు హైకోర్టులోనూ జీవో 9పై స్టేకు సంబంధించిన ఈ అంశం నవంబర్ రెండోవారం కల్లా విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పూర్తిస్థాయి విచారణకు ఎన్నిరోజులు పడ్తుందో చెప్పలేమని, ఒకవేళ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వచ్చినా, దీనిపై ప్రతివాదులు మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం లేకపోలేదని న్యాయనిపుణులు చెప్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను బట్టి చూస్తే.. దీనిపై మళ్లీ స్టే ఇచ్చి విచారణ కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులు, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్సమయం దాటినా డీమ్డ్ టు బీ అప్రూవ్డ్కింద ఆమోదంపైనా అనుమానమే వ్యక్తమవుతున్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత అంశం ఇప్పట్లో తేలేలా లేదని, న్యాయ పోరాటం చేస్తే ఏదో ఒక దశలో ప్రభు త్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణుల కమిటీ తన రిపోర్టులో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.