
- రాహుల్ గాంధీ కార్యాలయానికి దాసు సురేశ్ లేఖ
హైదరాబాద్, వెలుగు : పీసీసీ అధ్యక్షుడిగా బీసీకే అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్.. కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. డిప్యూటీ సీఎం పదవిని కూడా బీసీకి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయానికి ఆయన లేఖ రాశారు. తెలంగాణలో ఓసీకి సీఎం పదవి, ఎస్సీకి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టి సామాజిక న్యాయం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు.
‘‘ఔత్సాహిక బీసీ పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు ఉన్నత వర్గాలతో సమానంగా ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టులు, అవకాశాలలో ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు పాలకవర్గాలను ఏర్పాటు చేయడంతో పాటు పదేండ్లుగా చితికిపోయిన చేతివృత్తుల సహకార సంఘాలకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలి” అని సురేశ్ విజ్ఞప్తి చేశారు. ఆ లేఖను సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన విడుదల చేశారు.