
- అత్యవసర సమయాల్లో ఇబ్బందులు
- కనీస స్థాయిలోనే బ్లడ్ నిల్వలు
సిద్దిపేట, వెలుగు: జిల్లా బ్లడ్ బ్యాంకులో నెగిటివ్ గ్రూప్ బ్లడ్ కు కొరత ఏర్పడుతోంది. అత్యవసర సమయాల్లో దాతల కోసం వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జీజీహెచ్ (గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్) బ్లడ్ బ్యాంకులో ప్రస్తుతం 110 యూనిట్ల బ్లడ్నిల్వలు ఉంటే అందులో పాజిటివ్ గ్రూపులకు సంబంధించి 99 యూనిట్లు, నెగిటివ్ గ్రూపులు కేవలం 13 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. నెగిటివ్ గ్రూప్ బ్లడ్ అవసరమైనప్పుడు ఎవరో ఒకరు డొనేట్ చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది.
ఒక్కోసారి నెగిటివ్ గ్రూప్ దాత లభించకుంటే ఉన్న నిల్వల నుంచి రోగికి రక్తం అందించి ప్రాణాలు కాపాడుతున్నా మళ్లీ అవసరమైనప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు, గర్భిణీల ప్రసవ సమయంలో రక్తం అవసరం ఏర్పడుతోంది. ఇలాంటి సమయాల్లో నెగిటివ్ బ్లడ్ అవసరమైతే వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బ్లడ్ బ్యాంకు సిబ్బంది నెగిటివ్ గ్రూప్ బ్లడ్ దాతలను సంప్రదించి అప్పటికప్పుడు అత్యవసరంగా సేకరిస్తున్నారు.
వేసవి సీజన్ తో తగ్గిన క్యాంపులు
వేసవి సీజన్ లో బ్లడ్ డొనేట్ క్యాంపుల నిర్వహణ తగ్గడం ఇబ్బందులకు కారణమవుతోంది. స్టూడెంట్స్, స్వచ్ఛంద, యువజన సంఘాలు, సినీ హీరోల అభిమానులు నిర్వహించే బ్లడ్ డొనేట్ క్యాంపుల వల్ల బ్లడ్నిల్వలకు ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ వేసవిలో క్యాంపుల నిర్వహణ లేకపోవడంతో బ్లడ్ బ్యాంకులో బ్లడ్నిల్వలు తగ్గిపోయాయి. ప్రతి సంవత్సరం జీజీహెచ్ బ్లడ్ బ్యాంకు సగటున 2500 యూనిట్ల బ్లడ్ నిల్వలు సేకరిస్తోంది. వేసవి సీజన్ మినహా మిగిలిన సీజన్లలో క్యాంపుల నిర్వహణ రెగ్యులర్ గా ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడవు.
బ్లడ్డొనేషన్పై అవగాహన కల్పించాలి
బ్లడ్డొనేషన్పై అధికారులు మరింత అవగాహన కల్పించాలి. బ్లడ్ డొనేట్ చేసేవారు 18 నుంచి 55 సంవత్సరాలు మధ్య ఉండి 50 కిలోల బరువు ఉండాలి. మనిషి శరీరంలో ఐదు లీటర్ల బ్లడ్ఉంటే 350 మిల్లీ లీటర్లు మాత్రమే సేకరిస్తారు. ఒక వ్యక్తి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే మళ్లీ మూడు నెలల తర్వాత మాత్రమే చేయాలి. ఒక్కరు ఏడాదికి నాలుగు సార్ల కంటే ఎక్కువ బ్లడ్ డొనేట్ చేసే పరిస్థితి ఉండదు. బ్లడ్డొనేట్ చేయడం వల్ల శరీరంలోని ఐరన్, మినరల్స్ సమస్థాయికి చేరుతాయి. శరీరానికి ఎలాంటి హాని జరగదు.
పాజిటివ్ గ్రూపు బ్లడ్ స్టోరేజ్
ఏ పాజిటివ్ 16 యూనిట్లు
బి పాజిటివ్ 35 యూనిట్లు
ఓ పాజిటివ్ 35 యూనిట్లు
ఏబీ పాజిటివ్ 10 యూనిట్లు
నెగిటివ్ గ్రూప్ బ్లడ్ స్టోరేజ్
ఏ నెగిటివ్ 3 యూనిట్లు
బి నెగిటివ్ 2 యూనిట్లు
ఓ నెగిటివ్ 4 యూనిట్లు
ఏబీ నెగిటివ్ 4 యూనిట్లు
యువత ముందుకు రావాలి
యువత బ్లడ్డొనేట్కు ముందుకు రావాలి. నెగిటివ్ గ్రూపులకు సంబంధించిన దాతలు తక్కువ సంఖ్యలో ఉంటున్నారు. దీని వల్ల అత్యవసర సమయంలో నెగిటివ్ గ్రూపు బ్లడ్కావాలంటే ఇబ్బందులు ఎదురువుతున్నాయి. యువత ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ కార్యక్రమాల్లో పాల్గొంటే ఒకరికి ప్రాణదానం చేసినవారవుతారు. 30 మందికి పైగా బ్లడ్డొనేషన్కు సిద్ధంగా ఉంటే క్యాంపు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ లో నెగిటివ్ గ్రూప్ ల బ్లడ్ నిల్వలు తక్కువ సంఖ్య లో ఉన్నా అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. డాక్టర్ శ్రావణి, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి