హుస్నాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికలను వెంటనే నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి డిమాండ్‌చేశారు. పట్టణ కేంద్రంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నేపాల్‌లో 9 వామపక్ష పార్టీలు కలిసి కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడడం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి శుభపరిణామమని అభినందించారు. భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీలు ఒకే వేదికపై ఏకం కావాలని పిలుపునిచ్చారు.
అమెరికాలో న్యూయార్క్ మేయర్ ఎన్నిక ఫలితాలు ట్రంప్‌కు చెంపపెట్టు లాంటివిగా పేర్కొంటూ, భారతీయుడు జోహ్రాన్ మమదనీ మేయర్‌గా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడిన ఆయన, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, అదానీ-అంబానీలకు తొత్తులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్ఐసీకి రూ.29 వేల కోట్లు అప్పనంగా అప్పగించడం పబ్లిక్ రంగ సంస్థలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు.
రైతులపై నల్లచట్టాలు తీసుకువచ్చి 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదైన విషయంపై ఈసీపై ప్రశ్నలు లేవనెత్తారు. కేరళ భూ సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలుతో పేదరికం లేని రాష్ట్రంగా ఎదిగిందని కొనియాడారు. స్థానిక సంస్థలకు 40 శాతం బడ్జెట్ కేటాయించే కేరళ ప్రభుత్వ విధానం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సీపీఐ మద్దతు ప్రకటించిందన్నారు. రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, పేదవారు పోలింగ్ బూత్‌లకు రాకూడదని చేసిన కేంద్రమంత్రి మల్లన్ సింగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని పేర్కొన్నారు. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలు కొనసాగుతున్నాయని, వీటి ముగింపు సభ డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగనున్నదని తెలిపారు. ఈ సభకు 40 దేశాల కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు.
