సంగారెడ్డి టౌన్, వెలుగు: విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. గురువారం ఓడిఎఫ్ లోని గ్రౌండ్ వాకర్స్ కి, ఇస్మాయిల్ ఖాన్ పేట పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఈజీ మనీ అంటే మోసం అని గుర్తించాలన్నారు. డిజిటల్ అరెస్టు ఉండదన్నారు. ఆన్లైన్లో అపరిచితులకు దూరంగా ఉండాలన్నారు.
తెలియని లింక్స్, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసి మోసపోవద్దన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే 48 గంటల్లోపు 1930కు కాల్ చేసి కంప్లైంట్ చేసి నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐలు విజయ్ కృష్ణ, రవి, ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.
మెదక్ టౌన్: పోటీ ప్రపంచంలో సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్థానికులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ ట్రేడింగ్, బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నకిలీ ట్రేడింగ్యాప్స్, ఫేక్ ఐపీవోలు, పార్ట్‌టైమ్ జాబ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని లింకులు, యాప్‌లు డౌన్ లోడ్ చేయవద్దన్నారు. బ్యాంకు ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పరాదని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ అమర్, సైబర్ వారియర్ సిబ్బంది సయ్యద్, సతీశ్, సాయిబాబా పాల్గొన్నారు.
