జహీరాబాద్ లో వేంకటేశ్వర ఆలయంలో చోరీకి యత్నం

జహీరాబాద్ లో వేంకటేశ్వర ఆలయంలో చోరీకి యత్నం

జహీరాబాద్, వెలుగు:  పట్టణ పరిధిని మహీంద్రా కాలనీలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. పోలీసులు, దేవాలయ కమిటీ సభ్యులు కథనం ప్రకారం..తాళాలు పగలగొట్టి గుర్తుతెలియని దొంగలు మందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న అమ్మవారి వెండి కిరీటం, వరండాలో ఉన్న  హుండీ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న సొమ్మంతా మూటగట్టారు. 

అక్కడి నుంచి  వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా డ్యూటీలో ఉన్న పోలీసులు రావడాన్ని గమనించిన దొంగలు సిద్ధంగా ఉంచిన హుండీ సొమ్ము, అమ్మ వారి కిరీటాన్ని అక్కడే వదిలి పారిపోయారు. నైట్ డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులు దొంగల కోసం వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 

సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్ దేవాలయం వద్దకు చేరుకొని దొంగతనానికి యత్నించిన  విధానాన్ని పరిశీలించారు. సంగారెడ్డి నుంచి క్లూస్ టీమ్ రప్పించి దొంగల వేలిముద్రలు, తదితర వాటిని సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు.