IPL 2025: బెంగళూరును ఓడించటానికి రా: రోజుకు 150 మెసేజ్‌లు.. RCB అంటే ఎందుకింత ద్వేషం

IPL 2025: బెంగళూరును ఓడించటానికి రా: రోజుకు 150 మెసేజ్‌లు.. RCB అంటే ఎందుకింత ద్వేషం

ఐపీఎల్ లో మోస్ట్ అన్ లక్కీ జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పేరుంది. ఆటగాళ్లను మార్చినా.. కెప్టెన్లను మార్చినా.. ఆఖరికి ఆ జట్టు కోచ్ ను మార్చినా.. ఫలితం మాత్రం మారడం లేదు. 17 సీజన్ లుగా టైటిల్ అందని ద్రాక్షాగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో మూడు సార్లు ఫైనల్ కు వచ్చినా ట్రోఫీ గెలవలేకపోయింది. ముఖ్యంగా 2016 ఐపీఎల్ ఫైనల్లో విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది. ఈ ఫైనల్ ఓటమిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జీర్ణించుకోవడం కష్టమే. ఈ మ్యాచ్ లో బెంగళూరు అద్భుతంగా ఆడినప్పటికీ ఆసీస్ ఆల్ రౌండర్ బెన్ కటింగ్ ఆల్ రౌండ్ షో కారణంగా టైటిల్ చేజారింది. 

ఐపీఎల్ 2025లో మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సీజన్ లో ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా.. టాప్ 2 పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ ల్లో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దీంతో టాప్-2 లో చోటు దక్కించుకోని ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆర్సీబీ జట్టు టైటిల్ కొట్టడం చాలామందికి ఇష్టం లేనట్టు కనిపిస్తుంది. దీంతో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ చేసిన ఒక విచిత్ర పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

2016లో ఆర్సీబీకి వ్యతిరేకంగా బెన్ కటింగ్ ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. మొదటి బ్యాటింగ్ లో 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్ లో గేల్, రాహుల్ వికెట్లను తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆర్సీబీని ఓడించటానికి మరోసారి వేరే జట్టులోకి రావాలని కోరుకుంటున్నారట. ఈ విషయాన్ని కటింగ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. " నా ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రోజుకు 150కి పైగా మెసేజ్ లు వస్తున్నాయి. నన్ను ఐపీఎల్ ఆడాల్సిందిగా కోరుకుంటున్నారు. ఆర్సీబీకి వ్యతిరేకంగా వేరే జట్టులోకి రీప్లేస్ మెంట్ గా రావాలని మెసేజ్ చేస్తున్నారు" అని కటింగ్ చెప్పుకొచ్చాడు. 

2016 ఐపీఎల్ ఫైనల్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. 209 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 200 పరుగులకే పరిమితమైంది. కోహ్లీ, గేల్ తొలి వికెట్ కు 114 పరుగుల భారీ భాగస్వామ్యం అందించినా..మిగిలిన వారు విఫలం కావడంతో బెంగళూరు 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.