
సూర్యాపేట పట్టణంలో సాయి గణేష్ హాస్పిటల్ లో నకిలీ వైద్యుడు చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన మరువక ముందే మరో మహిళ చనిపోవడం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి మృతి చెందిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా మోతే గ్రామానికి చెందిన అనూష అనే మహిళకు పరీక్షలు గర్భంలో ఆడపిల్ల ఉన్నట్లుగా నిర్ధారించారు. మహిళకు అప్పటికే ఇద్దరు అమ్మాయిలు పుట్టడంతో లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఓ ఆర్ఎంపీని ఆశ్రయించింది. ఆమెను నకిరేకల్ లోని యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఇంట్లోనే పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్ లో మళ్లీ అమ్మాయి అని తేలడంతో అనుమతి లేని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుంది. వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావం జరటంతో అనూష అనే మహిళ చనిపోయింది.
Also Read : నమ్మలేని నిజం.. ఇది పచ్చి నిజం
నకిరేకల్ కు చెందిన యాదగిరి అనే వ్యక్తి ఇంట్లోనే మిషన్ ఏర్పాటు చేసుకుని చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాడు. టేకుమట్ల గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ అనూష అనే మహిళను యాదగిరి ఇంటికి స్కానింగ్ కోసం తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళ రక్తస్రావంతో చనిపోయిన వార్త తెలుసుకున్న యాదగిరి పరారైనట్లు తెలిపారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.