
- తీవ్రంగా పశుగ్రాసం కొరత
- పాలకు గిట్టుబాటు ధర లేక పశువుల పెంపకంపై అనాసక్తి
- ప్రస్తుతం విజయ డెయిరీకి 17వేల లీటర్ల పాలు సప్లయ్
కామారెడ్డి, వెలుగు : ఒకప్పుడు పాల ఉత్పత్తిలో కామారెడ్డి జిల్లా ముందంజలో ఉండేది. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి అధికంగా పాలు పోయడం వల్ల ప్రత్యేక గుర్తింపు ఉండేది. వాతావరణ పరిస్థితులు, పశుగ్రాసం కొరతతో పశువుల సంఖ్య తగ్గి పాల దిగుబడి తగ్గింది. దీనికితోడు ఎండల తీవ్రత వల్ల ఉన్న పాడి పశువులు పాలు తక్కువగా ఇస్తున్నాయి. పశువుల నిర్వహణ భారం, గిట్టుబాటు ధర, పచ్చిక బయళ్లు లేకపోవడం, కూలీల సమస్య వంటి కారణాలతో రైతులు పశువుల పెంపకాన్ని తగ్గించారు.
ఇదివరకు జిల్లాలో 2.50 లక్షల వరకు పాడి పశువులు ఉండగా, ఇందులో గేదెలు ఎక్కువగా ఉండేవి. కానీ గ్రామాల్లో గేదెల్ని అమ్మేస్తున్నారు. గతంలో 2 నుంచి 3 లక్షల లీటర్ల పాల దిగుబడి ఉండగా, ఇంటి, స్థానికుల అవసరాలకు పోను మిగతావి డెయిరీకి అమ్మేవాళ్లు. పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతోపాటు ఇటీవల జిల్లాలో ప్రైవేట్ డెయిరీలు ఎక్కువయ్యాయి.
జిల్లాలో పాల ఉత్పత్తి..
జిల్లాలో ప్రస్తుతం లక్ష లీటర్లకు మించి పాల ఉత్పత్తి జరగట్లేదు. విజయ డెయిరీ సెంటర్లు గ్రామాల్లో 168 ఉండేవి. ఇందులో 13 మూత పడ్డాయి. లింగంపేట, తాడ్వాయి, సదాశివనగర్ రాజంపేట మండలాల నుంచి గతంలో విజయ డెయిరీకి పాలు ఎక్కువగా వచ్చేవి. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు 50 వేల లీటర్ల పాలు సేకరించేవాళ్లు. ప్రస్తుతం 24 వేల లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. అన్ సీజన్లో బర్రె, ఆవు పాలు కలిపి 17 వేల లీటర్లు వస్తుండగా, అధికంగా ఆవు పాలే వస్తున్నాయి. గత 5 ఏండ్లుగా డెయిరీకి పాలు రావటం తగ్గింది. ఎండా కాలంలో పాల ఉత్పత్తి తగ్గింది. గతంలో గ్రామ శివారుల్లో బీడు భూములు ఉండేవి.
ఎక్కువ మంది అమ్మేశారు. మిషన్లతో వరిని కోయించడం వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో గడ్డి, దాణా కొనుగోలు ఖర్చులు పెరిగాయి తప్పా పాల ధర పెరగలేదు. ప్రస్తుతం జిల్లాలో లీటర్పాల ధర రూ.42.20 ఉండగా, ఆవు పాలు లీటర్కు రూ.36.72 ఉంది. రైతులు సెంటర్లలో పోసే పాలకు ఫ్యాట్ ప్రకారం రేటు చెల్లిస్తారు. జిల్లాలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.