వరి కోతలు వాయిదా వేసుకోండి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

వరి కోతలు వాయిదా వేసుకోండి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
  • కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ​

నిజామాబాద్, వెలుగు: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వరి కోతలు మూడు రోజులపాలు వాయిదా వేసుకుంటే మంచిదని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి రైతులకు సూచించారు. సోమవారం రెవెన్యూ శాఖ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి మాట్లాడారు. వాతావరణ మార్పులపై అన్నదాతల్లో అవగాహన కల్పించాలన్నారు. రైతుల నుంచి కాంటా పెట్టిన వడ్ల బస్తాలు రైస్​ మిల్లుకు చేరేలా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా టర్ఫాలిన్లు సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. పేమెంట్లు ఆలస్యం కాకుండా ట్రక్ షీట్లు తెప్పించుకొని ట్యాబ్​లో నమోదు చేయాలన్నారు. 

సోయాబీన్ కొనుగోలుకు 12 సెంటర్లు..

జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోలుకు 12 సెంటర్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం వాటిని రైతులకు అందుబాటులో పెట్టాలన్నారు. మక్కజొన్న కొనుగోళ్లను నిత్యం పర్యవేక్షించాలన్నారు. లోపాలులేని ఓటర్​ లిస్టు రూపకల్పన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్​ రివిజన్​ను ప్రయారిటీ కింద తీసుకోవాలని, మ్యాపింగ్​పై అలర్ట్​గా ఉండాలన్నారు. 2002 ఓటర్ లిస్టును 2025 లిస్టుతో క్రాస్​ చెక్ చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్​కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిగ్యాన్ మాల్వియా, నగర పాలక కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు. 

పక్క రాష్ట్రం పంట రాకుండా నిఘా..

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పంట కొనుగోళ్లు ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​కు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వడ్లు, సోయాబీన్​, కందులు, పెసర్లు రాకుండా నిఘా పెట్టాలని,  కపాస్ కిసాన్ యాప్​ వినియోగించి పత్తి కోనుగోళ్లు చేయాలని పేర్కొన్నారు.