ప్రారంభం కాని ఇండ్లపై కలెక్టర్ ఫోకస్

ప్రారంభం కాని ఇండ్లపై కలెక్టర్ ఫోకస్
  • ఇందిరమ్మ ఇండ్లపై స్పెషల్ డ్రైవ్​ 
  • జిల్లాలో ఇంకా షురూ కాని ఇండ్లు  5,398

కామారెడ్డి, వెలుగు : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కార్​ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది.  మొదటి విడత లబ్ధిదారులను గుర్తించి ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసింది. జిల్లాలో మంజూరైనవారిలో సగానికిపైగా నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో కలెక్టర్ ఆశిష్​సంగ్వాన్​స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.  జిల్లాలో 11,623 ఇండ్లు మంజూరు కాగా, ఇందులో 6,225 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా 5,398 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది. వీరందరూ త్వరగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.  మండల, గ్రామ స్థాయి అధికారులు లబ్ధిదారులను కలిసి పనులు చేపట్టేలా  కార్యాచరణ చేపట్టారు. 

కలెక్టర్​ ఆదేశాల మేరకు వారం రోజుల్లోగా ప్రతి ఇంటికి మార్కవుట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.  మండల, పంచాయతీ సెక్రటరీలు లబ్ధిదారుల వద్దకు వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న నగదు, మహిళా సంఘాల ద్వారా ఇచ్చే లోన్ల వివరాలను తెలియజేస్తున్నారు.   కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలతోపాటు  బాన్సువాడ నియోజక వర్గంలో ( కామారెడ్డి జిల్లాకు వచ్చే మండలాలు) మొత్తం 11,623 ఇండ్లు  మంజూరయ్యాయి. 

  ఇందులో ఇప్పటి వరకు 6,225 ఇండ్లకు మార్కవుట్ ఇవ్వగా,  నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పనులు దశలను బట్టి బిల్లులు లబ్ధిదారుల అకౌంట్లలో జమవుతున్నాయి.  ఇసుక, మొరం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్ అధికారులతో రివ్యూ చేయటంతోపాటు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు.   ఆయా గ్రామాల్లో సగం కూడా నిర్మాణాలు ప్రారంభించని సెక్రటరీలకు ఇటీవల షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.    

వారం రోజుల్లో  నిర్మాణాలు చేసుకునేలా.. 

ఈ నెలాఖరులోగా, లేదంటే నవంబర్​ 5లోగా ఇండ్ల నిర్మాణాలకు అధికారులు మార్కవుట్ ఇవ్వాల్సి ఉంది.  పనులు ప్రారంభించని లబ్ధిదారుల వద్దకు మండల అధికారులు, సెక్రటరీలు వెళ్లి మాట్లాడనున్నారు.   పనులు ప్రారంభించకపోతే ఇల్లు రద్దయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్తీక పౌర్ణమి మంచి రోజులు ఉన్నందున పనులు ప్రారంభించటానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్య ఉంటే  మహిళా సమాఖ్య ద్వారా లోన్ ఇప్పించనున్నారు. కొందరు లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.