లెటర్లు రాసి దులుపుకోవడం కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి : మంత్రి బండి సంజయ్

లెటర్లు రాసి దులుపుకోవడం కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి : మంత్రి బండి సంజయ్
  • జమ్మికుంట-రైల్వే స్టేషన్ ను ‘అమృత్  భారత్’లో చేరుస్తాం
  • కరీంనగర్  రైల్వే స్టేషన్ పున:ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, హాజరైన రాష్ట్ర మంత్రి పొన్నం

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్  పాలనలో నాయకులు ప్రతి దానికి లేఖలు రాసి చేతులు దులిపేసుకున్నారని, ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఇదంతా తమ వల్లే జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  విమర్శించారు. మాటలు కాదని, బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలన్నారు. ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందాయో కరీంనగర్  రైల్వే స్టేషన్  ఆధునీకరణే నిదర్శనమన్నారు.

గురువారం దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులోభాగంగా కరీంనగర్  రైల్వే స్టేషన్  ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సైతం అమృత్  భారత్  పథకంలో చేర్చి ఆధునీకరిస్తామని తెలిపారు. కరీంనగన్  నుంచి హసన్ పర్తి వరకు 61 కి.మీల కొత్త రైల్వే లైన్  నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డీపీఆర్​ తయారు చేశామన్నారు.

ఈ లైన్  నిర్మాణానికి రూ.1,480 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ లో పేర్కొన్నారని, దీనిపై త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కరీంనగర్–తిరుపతి రైలును వారానికి 4 సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్​ స్టేషన్ ను మార్పు చేసినట్లు గుర్తు చేశారు. కరీంనగర్  నుంచి ముంబై, షిర్డీకి రైలు ప్రారంభిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, మాజీ మేయర్  సునీల్ రావు పాల్గొన్నారు.