
- చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: దాసు సురేశ్
- బీసీల రిజర్వేషన్ల పెంపు తర్వాతే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుతం దేశంలో ఉన్నత, నిమ్న వర్గాల మధ్య ఆర్థిక అంతరాలు తీవ్రం అయ్యాయని, ఈ పరిస్థితులు అంతర్ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. ఈ అంతరాలను సామాజిక న్యాయం ద్వారానే అరికట్టొచ్చన్నారు. అందుకు దేశవ్యాప్త కులగణనే బ్రహ్మాస్త్రం అని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో 52% జనాభా కలిగిన బీసీలు నేటికీ విద్య, ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడి ఉన్నరు.
చట్టసభల్లో బీసీల ప్రాతినిథ్యం లేకపోవడమే ప్రధాన కారణం. వెంటనే బీసీలకు పార్లమెంట్, అసెంబ్లీలో 27% రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ప్రధాని మోదీ బీసీల పట్ల విశ్వసనీయతను నిరూపించుకోవాలి. సామాజిక, న్యాయ సాధనకు కులగణన చేపడ్తామని 2018లో అప్పటి హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటించారు. ఇప్పటికైనా బీజేపీ తమ నిబద్ధతను నిరూపించుకోవాలి. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్, క్రీమిలేయర్ తొలగింపు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్లు నెరవేర్చాలి’’అని దాసు సురేశ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలన్నీ అగ్రవర్ణాల కోసమే పని చేస్తున్నాయని విమర్శించారు.