బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలి: వామపక్షాల నేతలు

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలి: వామపక్షాల నేతలు
  • రాష్ట్రంలో బీజేపీ మద్దతిస్తూ.. కేంద్రంలో అడ్డుకుంటున్నది: నారాయణ
  • బీసీ జేఏసీ బంద్కు మద్దతుగా వామపక్షాల భారీ ర్యాలీ

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్‌‌లో చేర్చాలని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, టీజేఎస్​ ప్రెసిడెంట్​ కోదండరాం డిమాండ్​ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని కోరుతూ తలపెట్టిన బంద్​కు మద్దతుగా శనివారం వామపక్షాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్​లో పాల్గొనాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, టీజేఎస్​ ప్రెసిడెంట్​ కోదండరాం తదితరులు నారాయణగూడ వైఎంసీఏ నుంచి కాచిగూడ చౌరస్తా, కోఠి, సుల్తాన్ బజార్, రామకోఠి, బొగ్గులకుంట మీదుగా అబిడ్స్ చౌరస్తా చేరుకుని అక్కడ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌‌‌‌, బిల్లు తీసుకొచ్చింది.

అసెంబ్లీలో బీసీలకు అన్యాయం జరిగితే సహించబోమని బీజేపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ బిల్లును ఆపింది ఎవరో ఇప్పుడు రోడ్డు మీదికి వస్తున్న బీజేపీ నేతలు చెప్పాలి” డిమాండ్​ చేశారు. సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ, బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని, ఆ పార్టీ ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తూనే కేంద్రంలో ఆపుతున్నదని మండిపడ్డారు. కావాలనే బీసీ బిల్లును బీజేపీ పెండింగ్‌‌‌‌లో పెట్టిందని, మోదీ నిజమైన బీసీనో కాదో తెలియడానికి నార్కో టెస్ట్ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతి సమాఖ్య రెండు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, టీజేఎస్​నేత ప్రొ.విశ్వేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్​) మాస్ లైన్ హన్మేశ్, ఎంసీపీయూఐ నాయకులు గదేగోని రవి పాల్గొన్నారు.