
- అప్పటి వరకూ పోరాడుతూనే ఉంటం
- బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు వెల్లడి
- పార్లమెంటులో బీసీ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని స్పష్టం
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించాలని, ఆ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిందే అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. అప్పటి వరకూ 42 శాతం రిజ్వర్వేషన్ల కోసం పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఆర్డినెన్స్, జీఓల వల్ల రిజర్వేషన్ల పెంపు సాధ్యపడదని, పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో పొందుపర్చాకే అమలు సాధ్యమని తమ పార్టీ మొదటి నుంచి చెబుతున్నదని ఆయన గుర్తుచేశారు.
బీసీ జేఏసీ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు బంద్ కు మద్దతుగా శనివారం ఉదయం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆందోళనకు దిగారు. ఎంపీ రవిచంద్ర, పార్టీ నేతలు మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రివర్గంలో మున్నూరుకాపు, యాదవ, కుర్మ, ముస్లిం, లంబాడీలకు చోటు ఇవ్వలేదని ఆయన ఫైరయ్యారు. కులగణనలో జనాభాను 25లక్షలపైగా తక్కువ చేసి చూపడంపై సబ్బండ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.