బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్నరు : ఆర్. కృష్ణయ్య

బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్నరు : ఆర్. కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్లపై డిసెంబర్ 13,14 తేదీల్లో పార్లమెంట్​ను ముట్టడిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలో రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు, బర్రెలు , పందులు, పెన్షన్లు ఇచ్చి శాశ్వతంగా బిచ్చగాళ్లను చేస్తున్నారని మండిపడ్డారు.  కాచిగూడలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు.

అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. బీసీలను ఓటు బ్యాంక్​గా వాడుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయని, కానీ రాజకీయంగా రిజర్వేషన్లు ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ పార్లమెంట్ సభ్యుడు లేడని, లోక్​సభలో 545  సభ్యులకు 96 మంది మాత్రమే బీసీలు ఉన్నారని గుర్తు చేశారు. బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్ల మహేందర్​ను  నియమిస్తూ  ఆయన నియామక పత్రం అందజేశారు.  సమావేశంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , ఏపీ అధ్యక్షుడు ఎన్.మారేశ్, నేతలు రాజేందర్ పాల్గొన్నారు.